
- కిషన్ రెడ్డిపై వివేక్ వెంకటస్వామి ఫైర్
- గోదాములు పెంచడంలో కేంద్రం ఫెయిల్
- రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తం
- వడ్ల అన్లోడింగ్ పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే
సుల్తానాబాద్, కోల్‌బెల్ట్, వెలుగు : కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇక్కడ ధర్నాలు చేసే బదులు గోదాముల స్పేస్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతుల ప్రస్తావనే లేదన్నారు. కానీ ఆ పార్టీ నేతలు రైతు సమస్యలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అస్నాద్, ఒత్కులపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వివేక్ సందర్శించారు.
తర్వాత చెన్నూరు ప్రెస్‌క్లబ్, సుల్తానాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వడ్ల తరలింపు, నిల్వ తదితర అంశాలు కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉన్నాయన్నారు. మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐకి ధాన్యాన్ని ఇచ్చినప్పుడు వాటిని నిల్వ చేయడానికి గోడౌన్ స్పేస్ సరిపడా లేదన్నారు. దీంతో సీఎంఆర్ బియ్యం స్టాక్ చేయడంలో సమస్య వస్తున్నదని, తద్వారా కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులను ఆదుకునే ఉద్దేశం ఉంటే గోడౌన్లును ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఖర్చు పెడుతున్నదని గతంలో కిషన్‌రెడ్డి చెప్పారని, ఇప్పుడు అకాల వర్షాలతో పంట నష్టపోతున్నా గోడౌన్ స్పెస్ ఎందుకు పెంచడంలేదని మండిపడ్డారు.
జులైలో నాట్లు వేయాలె..
చెన్నూరు రైతులు నియోజకవర్గ వ్యాప్తంగా జులై 15లోపు నాట్లు వేయాలని వివేక్ కోరారు. సన్నవడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని, రైతులు సన్న వడ్లు పండించి లాభాలు ఆర్జించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా తాను రైతులకు అండగా ఉంటామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో లక్ష ఇరువై ఐదు వేల టన్నుల వడ్లు కొనుగోలు చేశామన్నారు.
12,600 మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయన్నారు. తన పేరు చెప్పుకొని ఎవరైనా తప్పుడు పనులు చేస్తే సహించేది లేదని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన్ను లీడర్లు, మిల్లర్లు ఘనంగా సన్మానించారు. ఆయన వెంట పీఎసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, కాంగ్రెస్ నేతలు మినుపాల ప్రకాశ్ రావు, చెన్నూరు టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, అంతటి అన్నయ్య గౌడ్, సజ్జద్, అబ్బయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొండి సతీశ్, బాపురెడ్డి, హిమవంత్‌రెడ్డి, పోటు రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకుంటం
చెన్నూరు నియోజకవర్గంలో సేకరించిన వడ్లను నిల్వ చేసేందుకు గోదాముల కెపాసిటీ చాలకపోవడంతో.. ఉన్నతాధికారులతో మాట్లాడి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపేలా చర్యలు తీసుకున్నట్లు వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఆయన సూచనతో సుల్తానాబాద్ పట్టణ శివారులోని సుగ్లాంపల్లి గోదాములలో, ర్యాకల్ దేవుపల్లి శివారులోని వాసంతి రైస్ మిల్లులో వడ్ల అన్లోడింగ్ ను చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసినట్టు చెప్పారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అందుకుంటామని, ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా హామీ ఇచ్చారని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని వివేక్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో వడ్లు ఎక్కువగా పండాయని, దానికి తగినట్టు హమాలీలు, లారీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నట్లు తెలిపారు.