మంత్రి కేటీఆర్ పై చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఫైరయ్యారు. చెన్నూర్ లో కాకా ఫ్యామిలీ ఏం చేసిందని కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడాడని మండిపడ్డారు. కేటీఆర్ ఒక బచ్చ అని విమర్శించారు. కాకా వెంకటస్వామి తెలంగాణ వాది అన్న వివేక్.. 1969లో తూటా దెబ్బలు తిన్నాడని గుర్తుచేశారు. వెంకటస్వామి కృషితోనే 2004లో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు కుదిరిందని చెప్పారు. కాకా కుటుంబంతోనే కేసీఆర్ లాభపడ్డారని అన్నారు. 2013లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తిని తానని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన సిరిసిల్ల బిడ్డ కేకే మహీందర్ రెడ్డి సీటును 2009లో కేటీఆర్ కబ్జా చేసిండని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబం, సుమన్ కు అలవాటైందన్నారు వివేక్. చెన్నూరు రూపు రేఖలు మారలేదు కానీ సుమన్ రూపు రేఖలు మారాయని చెప్పారు. ఇసుక దందా కోసమే బ్రిడ్జిలు, రోడ్లు వేశారని అదేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు.
కేటీఆర్, సుమన్ తనపై సూట్ కేస్లు అంటూ ఆరోపణలు చేస్తున్నారని... తానోక బిజినెస్ మెన్ అని రూ. 10 వేల కోట్లు ట్యాక్స్ కట్టానని అన్నారు వివేక్. కేసీఆర్, కేటీఆర్, సుమన్ అవినీతి అక్రమాలపై విచారణ చేసి జైలుకు పంపడం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత దర్యాప్తు సంస్థలపై పరువునష్టం దావా వేస్తానన్నారు వివేక్. కాళేశ్వరంపై హై పవర్ టీమ్ తో రివ్యూ చేయించి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు వివేక్. ఎక్కువ భూములు ఉండి వ్యవసాయం చేయని వాళ్లకు రైతు బంధు ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుబంధుపై రివ్యూ చేస్తాన్నారు వివేక్.