కేసీఆర్​ మెడలు వంచి పింఛన్లు ఇప్పిస్తాం : వివేక్ వెంకటస్వామి

చౌటుప్పల్, వెలుగు: బీజేపీని గెలిపిస్తే పింఛన్లు కట్ చేస్తానని మంత్రి జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కోర్ కమిటీ మెంబర్, ఉప ఉన్నిక స్టీరింగ్​కమిటీ చైర్మన్​ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ‘పింఛన్లు ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నడా..? సీఎం కేసీఆర్ మెడలు వంచి పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలను బీజేపీ అందజేస్తుంది’ అని అన్నారు. బుధవారం చౌటుప్పల్ లోని లింగోజిగూడెం, తలసింగారం, రామ్ నగర్ కాలనీలోని దళితవాడలో భోజనం చేశారు. లింగోజి గూడెంలో వివేక్​కు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు.

ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ ఇంట్లో నుంచి పెన్షన్లు ఇవ్వడం లేదని, బీజేపీకి ఓటు వేస్తే ఇవ్వననడం మూర్ఖత్వమన్నారు. గత ఎన్నికల సందర్భంగా చౌటుప్పల్​లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కట్టిస్తానని సీఎం హామీ ఇచ్చాడని, దాన్ని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా తో మునుగోడు అభివృద్ధి గురించి చర్చించారని, అందులో భాగంగా చౌటుప్పల్ లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు ఆయన అంగీకరించారని చెప్పారు. రూ.200 కోట్లతో మునుగోడులో రోడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని అమిత్ షా చెప్పాడన్నారు. మహిళా మోర్చా నాయకురాలు పాదూరి కరుణ, మాజీ జాతీయ ఎస్సీ కమిషన్  మెంబర్ రాములు పాల్గొన్నారు.