రాష్ట్ర సంపదంతా ఆంధ్రా కాంట్రాక్టర్లకు ధారాదత్తం 

  • ఇక్కడ రైతులు చనిపోతే కనీసం పరామర్శించలేదు
  • ఇతర రాష్ట్రాలకు వెళ్లి పరిహారం ఇవ్వడం సిగ్గుచేటు

మంచిర్యాల : రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని, కాంట్రాక్టర్ల సర్కారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఫైరయ్యారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ ​ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడని విమర్శించారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ డిజైనింగ్​చేసి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాడని, అందులో రూ.50వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం, దోపిడీకి నిరసనగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆధ్వర్యంలో ఆదివారం లక్సెట్టిపేటలోని ఉత్కూర్​ చౌరస్తాలో 'రైతు గోస – బీజేపీ పోరు దీక్ష' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ.. వడ్లు కొనాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని, ఎన్ని బియ్యం ఇచ్చినా తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.  రైతులను కేసీఆర్​ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 40 కిలోల బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తున్నారని, మిల్లర్లు, లీడర్లు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తానని కేసీఆర్​ మోసం చేస్తే.. ప్రధాని నరేంద్రమోడీ ఎరువులపై ఎకరాకు రూ.10 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నారని చెప్పారు. ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో పంట నష్టపోయిన రైతులు పరిహారం అందడం లేదన్నారు.  

క్వింటాల్​కు 8 కిలోల వడ్లు దోచుకుంటున్నరు
కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్​కు ఏడెనిమిది కిలోల వడ్లు కోత పెడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. ఈ దోపిడీ బయటపడుతుందనే రైతులకు రశీదులు ఇవ్వడం లేదన్నారు. 

కేసీఆర్​వి​ పిచ్చి నిర్ణయాలు
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే  కనీసం పరామర్శించని కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లడం సిగ్గుచేటని వివేక్ అన్నారు. టీఆర్​ఎస్​ గ్రాఫ్​ పడిపోయిందని, ఆ ఒత్తిడిలో కేసీఆర్​ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ రాజకీయాలంటూ కొత్త పాట ఎత్తుకున్నాడని విమర్శించారు. 

మరిన్ని వార్తల కోసం : -

రాష్ట్ర సర్కార్ తీరుతో దివాలా దిశగా సింగరేణి..


రాష్ట్రం వచ్చే నాటికి రూ.3,500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్