
- ప్రతి పంచాయతీకి రూ.5 లక్షల నిధులు
- క్యాతనపల్లి మున్సిపల్ వార్డుల్లో ఆకస్మిక పర్యటన
కోల్‌బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, వారు కలలుగన్న తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సాధించబోతున్నామని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జైపూర్ మండల కేంద్రం ముదిగుంట గ్రామంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.
విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు అందజేశారు. అనంతరం మిట్టపెల్లి గ్రామంలో ఎడ్ల పందాలను ప్రారంభించారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో జరిగిన కాకా వెంకటస్వామి-కళావతి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ప్రైజ్‌లు అందించారు. కొత్తగా చెన్నూరు–హైదరాబాద్ మార్గంలో నడవనున్న ఏసీ సెమీ స్లీపర్ లహరి బస్సును చెన్నూర్ బస్టాండ్‌లో ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో పదేండ్లుగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక మథనపడ్డారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి న్యాయకత్వంలో తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నట్లు చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ రూ.40 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథలో లోపాలున్నాయని, పనులు పూర్తికాక ఇంటింటికీ నీళ్లు రావడంలేదన్నారు. లోపాలపై ఎంక్వయిరీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి కోరానని, సమస్యల పరిష్కారానికి స్పెషల్‌గా రూ.10 కోట్ల ఫండ్స్‌ను ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. నెల రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు నీళ్లు వచ్చేలా చూస్తామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున ఫండ్స్ కేటాయిస్తానని పేర్కొన్నారు.
రైల్వే ఫ్లైఓవర్ పనులు స్పీడ్చేయాలె
రామకృష్ణాపూర్ -మంచిర్యాల ప్రధాన రహదారిలోని క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మరిన్ని మెషీన్లు, మ్యాన్‌పవర్‌ను నియమించి పనులను స్పీడప్ చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, ఆఫీసర్లను ఆదేశించారు. అంతకు ముందు మార్నింగ్‌వాక్‌లో గద్దెరాగడి, సాయి కుటీర్, బి-జోన్ సెంటర్ చౌరస్తాలో పర్యటించారు. గత ప్రభుత్వాలు డ్రైయినేజీలు నిర్మించకపోవడంతో మురికి నీరంతా రోడ్లపై నిలిచి నడవలేకపోతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
రామకృష్ణాపూర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తాడికొండ రంగాచారి, బోయిన రవికుమార్, చెన్నూరు మండలం కత్తరశాల, సుందరశాల గ్రామాలకు చెందిన చిన్న రాజమల్లు, పోటు పద్మ ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే వివేక్పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో క్యాతనపల్లి, రామకృష్ణాపూర్, జైపూర్, చెన్నూరు కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.