
కోల్ బెల్ట్, వెలుగు: మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి అన్నారు. శనివారం చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బోరంపల్లి, కొల్లూరు, లక్ష్మీపూర్, రాంపూర్, దేవులవాడ సిర్సా, వెళ్లంపల్లి, రాపన్ పల్లి, అర్జున గుట్ట, అన్నారం, రాజారామ్, కొత్తపల్లి, లింగన్నపేట, ఏదుల బంధం, పులగామ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. కొల్లూరి మాజీ సర్పంచ్ జాంగా రమేశ్ 200 మంది తన అనుచరులతో వివేక్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయా గ్రామాల్లో పలువురు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో జాయిన్ కాగా వివేక్ వెంకటస్వామి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం చెప్పులూరు ఎమ్మెల్యే దేవేందరప్ప, చెన్నూర్మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్ పర్సన్ మూల రాజిరెడ్డి, ఓయూ జేఏసీ చైర్మన్ శ్రేష్ యాదవ్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.
అపర భగీరథుడు వివేక్ వెంకటస్వామి
అపర భగీరథుడు వివేక్ వెంకటస్వామి అని కాంగ్రెస్ యూత్ లీడర్ నందకిషోర్ అన్నారు. చెన్నూరుకు ఏం చేశావ్ అని బాల్క సుమన్ అంటుండు.. తాగునీటి సమస్య తీర్చిన ఆపర భగీరథుడు వివేక్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వివేక్ వెంకటస్వామి సేవ చేసిన వ్యక్తి అన్నారు. వివేక్ గురించి మాట్లాడే స్థాయి బాల్క సుమన్‌ది కాదన్నారు. బానిస, అహంకార సుమన్ ను తరిమి కొట్టే రోజులు వచ్చాయన్నారు. 30 జరిగే ఎన్నికల్లో సుమన్ ఓటమి ఖాయమన్నారు.
నయా నయీం బాల్క సుమన్
తెలంగాణలో గూండా నయీం చనిపోయాడని, చెన్నూరులో బాల్క సుమన్ నయా నయీం అవతారం ఎత్తాడని ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్ విమర్శించారు. సుమన్ నియోజకవర్గంలో డబ్బులు కుమ్మరిస్తున్నాడని.. కానీ ఏం చేసినా అతడి ఓటమి ఖాయమన్నారు. బాల్క సుమన్‌కు ఓటేస్తే నిరుద్యోగులు నాశనం అవుతారని హెచ్చరించారు. కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, దాన్ని మళ్లీ కట్టి మరో లక్ష కోట్లు మింగడానికి కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ బాగుపడాలంటే బీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు.
వివేక్ వెంకటస్వామి గెలుపుతోనే అభివృద్ధి
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్, యాదవ సంఘం బాధ్యుడు బండి సదానందం అన్నారు. మందమర్రి మున్సిపాలిటీలోని 23వ వార్డు పరిధి బురదగూడెం, మారుతీనగర్, రాజీవ్ నగర్, మేదరి బస్తీలో వివేక్ వెంకటస్వామికి మద్దతుగా శనివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధంతా కాకా వెంకటస్వామి హయాంలోనే జరిగిందన్నారు.
ప్రస్తుతం అదే బాటలో, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సేవలో ఉంటున్న కాకా తనయుడు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని ప్రజలు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టే మాటలు సుమన్ మానుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రచారంలో లీడర్లు దుర్గం ప్రభాకర్, బండి శివకుమార్, దుర్గం మల్లేశ్, శెగ్గం రవి కుమార్, బత్తుల శ్రీనివాస్, సతీశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.