- డ్రైయినేజీ పనులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భూమిపూజ
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు అప్పటి పెద్దపల్లి ఎంపీ కాకా వెంకటస్వామి రూ.24 కోట్లతో గోదావరి నుంచి తాగునీరు సప్లై చేసే శాశ్వత పథకాన్ని తీసుకొచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే డా.వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం సాయంత్రం మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో రూ.2.21 కోట్ల స్పెషల్‌డెవలప్‌మెంట్ ఫండ్స్‌తో చేపట్టనున్న డ్రైయినేజీ నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీకృష్ణతో కలిసి భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మందమర్రి మున్సిపాలిటీలోని వార్డులో తాగునీటి సమస్యలు తీర్చేందుకు విశాఖ ట్రస్ట్ ద్వారా వాటర్ ట్యాంక్, బోర్‌వెల్స్‌తో నీటిని సప్లై చేసి ప్రజల కష్టాలు తీర్చామని గుర్తుచేశారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా కాని ప్రాంతాల్లో బోర్‌వెల్స్ వేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా డ్రైయినేజీ నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు సమర్పించారు. కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ సుమతి, ఏఈ అచ్యుత్, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో..
చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామంలోని మంతమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేక్, నల్లాల ఓదెలు, గడ్డం వంశీకృష్ణ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. భీమారం మండల కేంద్రానికి చెందిన కంకణాల సుధాకర్ రెడ్డి కూతురు వివాహం జరిగిన నేపథ్యంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు