అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి బుధవారం పరిశీలించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‍పూర్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, దమ్మన్నపేట, పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగెపెల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్లను సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం, మిల్లర్లు ఒక్కటై తాలు పేరుతో రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
మంత్రులకు కమీషన్ల కోసమే మిల్లర్లు తరుగు తీస్తున్నరు
వరంగల్/వర్ధన్నపేట/స్టేషన్‍ఘన్‍పూర్/పెద్దపల్లి, వెలుగు: ఓవైపు అకాల వర్షాలతో రైతులు ఆగమై కన్నీళ్లు పెడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం, మిల్లర్లు ఒక్కటై తాలు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‍పూర్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట, దమ్మన్నపేట, పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగెపెల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు. మిల్లర్లు క్వింటాల్‍కు 5 కిలోలు తరుగు తీస్తూ రైతులను నిండా ముంచుతున్నారని వివేక్ ఫైర్ అయ్యారు. రైతులకు అండగా ఉండేందుకే ‘రైతు గోస బీజేపీ భరోసా’ కార్యక్రమం చేపట్టామని.. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పారు. ‘‘మంత్రులకు కమీషన్లు ఇచ్చేందుకే తరుగు తీస్తున్నామని మిల్లర్లు చెబుతున్నారు. రైతులను నట్టేటా ముంచుతున్న మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఇది నిజమేనన్న సందేహం కలుగుతోంది” అని అన్నారు.
మేఘా కృష్టారెడ్డిపై ఉన్న ప్రేమ రైతులపై ఏది?
సీఎం కేసీఆర్ రైతులను కోటీశ్వరులను చేస్తానంటూ లక్షల కోట్ల కమీషన్ల సొమ్ము తన కుటుంబ ఖాతాల్లో వేసుకుంటున్నారని వివేక్ ఆరోపించారు. ‘‘కాళేశ్వరం మోటార్లు మునిగాయనే పేరుతో కాంట్రాక్టర్ మేఘా కృష్టారెడ్డికి రూ.1,200 కోట్లు శాంక్షన్ చేసిన కేసీఆర్.. పంట నష్టపోయిన రైతులను మాత్రం ఆదుకోవడం లేదు. ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తానని చెప్పి రెండు నెలలైనా ఇప్పటివరకు ఒక్కరికి రూపాయి ఇవ్వలేదు. ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేయడం లేదు” అని అన్నారు. తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని, ఎకరానికి రూ.20 వేల నష్టపరిహారం చెల్లించాలని, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, బీజేపీ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల ఇన్ చార్జ్ క్రాంతి వాళ్ల అమ్మ ఇటీవల మృతి చెందగా, కుటుంబసభ్యులను వివేక్ పరామర్శించారు. మంథని పట్టణంలో కాగితపు లలిత ఇటీవల మరణించగా కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. అలాగే ఇటీవల అనారోగ్యానికి గురైన రిపోర్టర్ కొమరోజ్ మారుతి, ఆళ్ల బాపులను పరామర్శించారు. మంథని బీజేపీ సీనియర్ లీడర్ చందుపట్ల సునీల్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు తదితరులు పాల్గొన్నారు.