
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలోని, క్యాతనపల్లి మున్సిపాలిటీ, భీమారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ, 9వ వార్డు ఆర్ఆర్ నగర్ కాలనీ చెందిన బీమా సుధాకర్ నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు హస్తం గూటికి చేరారు. లీడర్లు పొడేటి రవి, భూక్య లక్ష్మణ్, పెద్దల బాపు ఆధ్వర్యంలో భీమారం మండలానికి చెందిన మనుబోతుల వెంకటేశ్వర్లు, నర్సింగపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి విజేందర్, భూమయ్య ,ప్రేమ్ సాగర్‌తో పాటు మరో 40 మంది, బూరుగుపల్లిలో మహిళా నాయకులు ధరావత్ మంగిబాయి, భూక్య ఎంకాలిబాయి, లెక్కల కళావతి, యువకులు రమేశ్‌తో పాటు అనేక మంది యువకులు కాంగ్రెస్‌లో చేరారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్ పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని, ఆయన అరాచక పాలనతో విసుగు చెందామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ గెలుపుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి,పెద్దపల్లి తిరుపతి,మోహన్ రెడ్డి, అనపర్తి రమేశ్, పోటు భాస్కర్ రెడ్డి, కేపీ రవి, వేల్పుల శ్రీనివాస్, అమర్ సింగ్, తేజా రెడ్డి, ఆవుల సురేశ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు వివేక్ వెంకటస్వామి భీమారం మండలంలోని కొత్తపల్లి, ఎల్బీ పేట్, మద్దికల్, ఆరెపల్లి ,అంకుశాపురం, ఎల్కేశ్వరం, నేరేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. పూల మాలలు, మంగళవహారతులతో ఆహ్వానించారు.జై కాంగ్రెస్ నినాదాలతో గ్రామాలు హోరెత్తాయి.
బాల్క సుమన్‌కు ఓటేస్తే మీ పిల్లల్ని మీరు చంపుకునట్టే!
చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి బాల్క సుమన్‌పై ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్ మండిపడ్డాడు. బాల్క సుమన్ లాంటి దుర్మార్గపు వ్యక్తిని గెలిపిస్తే మీ ఇండ్లలోని పిల్లలు ఆగం అవుతారని, అతడికి ఓటేస్తే మీ పిల్లల్ని మీరే చంపుకున్నట్లు అవుతుందన్నారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా బీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి ఓయూ జేఏసీ విద్యార్థి విభాగం తరఫున మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బాల్క సుమన్‌పై ఫైర్ అయ్యారు.
మీ పిల్లలు, మీ ఊరు కోసం బాల్క సుమన్‌కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. సుమన్‌ను గెలిపిస్తే ఏమైతదో ఆయనతో చదివిన తోటి విద్యార్థులను అడిగితే తెలుస్తుందన్నారు. ఉద్యోగం రాలేదనే బాధలో ఆడపిల్ల ప్రవళిక సూసైడ్ చేసుకుంటే క్యారెక్టర్ మీద మచ్చ వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే రాష్ట్రంలో కేసీఆర్, చెన్నూరులో బాల్క సుమన్ ఓడిపోవాలన్నారు.