
- కర్నాటకలో వివేక్ ప్రచారం
- కుష్టగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరిన యువకులు
- లింగ్సుగూర్ క్యాండిడేట్‌కు బీఫామ్ అందజేత
హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొంటున్నారు. కుష్టగి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా బీజేపీ హైకమాండ్ వివేక్‌కు బాధ్యతలు అప్పగించింది. బుధవారమే అక్కడికి వెళ్లిన వివేక్.. నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దొడ్డనగౌడ హనుమగౌడ్ పాటిల్‌తో కలిసి ప్రచారం మొదలుపెట్టారు. గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 100 మంది యువకులు వివేక్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
ప్రధాని మోడీ పాలన, స్కీమ్‌లు నచ్చి యువకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని వివేక్ అన్నారు. కుష్టగి నియోజకవర్గంలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి దొడ్డబసవ సుంకదా, చంద్రకాంత్, వెంకప్పయ, దేశాయ్, శర్వాణ పాటిల్ పాల్గొన్నారు. అదే విధంగా లింగ్సుగూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానప్పడి వజ్జల్కు వివేక్ బీఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చంద్రశేఖర్ ఆలిగేరి, బస్వరాజ్ హల్లుర్, శంకరగౌడ పాటిల్, శరణు పాల్గొన్నారు.