సరైన నిర్ణయమే.. తెలంగాణలో మార్పే లక్ష్యంగా

సరైన నిర్ణయమే..  తెలంగాణలో మార్పే లక్ష్యంగా

ప్రముఖ నేత, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి ఇటీవల భారతీయ జనతా పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివేక్ కాంగ్రెస్ పార్టీలోకి మారడంపై చాలా తక్కువ మంది విమర్శించారు.  ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకున్న వారెవరూ వివేక్​ కాంగ్రెస్​ పార్టీలో చేరడాన్ని  తప్పు పట్టలేదు. కానీ, రాజకీయం అన్నాక కొందరైనా తప్పు పట్టేవారుంటారు. అది పెద్దగా లెక్కించాల్సింది కాకపోవచ్చు. అయినా  వివేక్​ను విమర్శించినవారు, ఎన్నడూ అవినీతిపరులైన నేతలపై ఆరోపణలు చేయలేదు. కనీసం బహిరంగంగా విమర్శలు కూడా చేయలేదు. అలాంటి వారు ఏ ఆరోపణలు లేని వివేక్​ వెంకటస్వామి పార్టీ మారి తప్పు చేస్తున్నట్లు అనడం సమంజసంగా లేదు. 

వివేక్​ తను ఓ శక్తిమంతమైన నేత కాబట్టి తనను తాను రక్షించుకోగలరు. కానీ, నేను ఓ రాజకీయ సూత్రానికి మద్దతు ఇస్తాను. ఓ రాజకీయ నాయకుడు తన అవసరం పార్టీకి లేదని గుర్తించినప్పుడు అతను వేగంగా చర్యలు తీసుకోవాలి.  ఒక నాయకుడు తన రాజకీయ లక్ష్యాన్ని  సాధించాలనుకున్నపుడు ఆ పార్టీలోనే ఉండాలా లేక  పార్టీని వదిలేయాలా అనేది ఆ నాయకుడి వ్యక్తిగత నిర్ణయం. ఆ నిర్ణయాన్ని లీడర్లు గౌరవించాలి.
 

రాజకీయ పార్టీలు హిమాలయాల్లోని కైలాస పర్వతంపై  ఏర్పడటం లేదని మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా రాజకీయ పార్టీలన్ని హోటల్స్​లో లేదా నాయకుల ఇండ్లలోనూ లేదంటే వివాహాలకు ఉపయోగించే ఫంక్షన్ హాల్స్​లో రూపం దిద్దుకుంటాయి. అయితే, మహాత్మాగాంధీ కాంగ్రెస్​, సుభాశ్ చంద్రబోస్​ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్​ బ్లాక్​ వంటి పార్టీలకు మినహాయింపు ఉంటుంది. కానీ,  ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను పరిశీలిస్తే ఏ రాజకీయ పార్టీకి మహాత్మా గాంధీ,  సుభాశ్ చంద్రబోస్​ నాయకత్వం వహిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

కూటములే మారిపోతున్నాయి కదా!

నేటి రాజకీయ కూటములను పరిశీలిస్తే ప్రతి రోజూ ఏదో ఒక రాజకీయ పార్టీ తన కూటమిని మారుస్తోంది. కూటమిని ఎందుకు మారాల్సివచ్చిందో రాజకీయ నాయకులు చాలా రకాల కారణాలు చెపుతారు.  లీడర్లు తమను సమర్థించుకునే క్రమంలో కొంతమంది ఏ మతాన్ని అధికారికంగా ప్రోత్సహించని సెక్యులరిజం పేరు చెపితే.. ఇంకొంతమంది నాయకులు వంశపారంపర్య రాజకీయాలు, అవినీతి తదితర కారణాలను చెపుతారు. దేశంలో చాలా రాజకీయ పార్టీలు వంశపారంపర్యంగా కొనసాగుతున్నవే. ఆ పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు వారు రాజకీయ కూటములను మారడాన్ని ఎలా సమర్థించుకోగలరు? తమ గుర్తింపునకు ప్రమాదం అని భావించినపుడు కూటమిని మార్చుకుంటాయి. బీజేపీ, డీఎంకే ఐదేండ్లపాటు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ అన్నాడీఎంకేతో జత కట్టింది. ఆ తర్వాత అన్నాడీఎంకేను వదులుకున్న బీజేపీతో మళ్లీ డీఎంకే మిత్రపక్షంగా చేరింది. డీఎంకే, అన్నాడీఎంకే ఎన్డీయేలో చేరడం, బయటకు రావడం వంటి  జాబితా అంతులేనిది. 

బీజేపీలో చేరిన అనిల్​ ఆంటోనీ

కొన్ని నెలల క్రితం, భారతదేశపు గొప్ప రాజకీయ నాయకులలో ఒకరు,  కేరళకు చెందిన కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు ఎకె ఆంటోనీ  కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. అనిల్‌‌‌‌ ఆంటోనీ కాంగ్రెస్‌‌‌‌ను దెబ్బతీశారని పలువురు విమర్శించారు. అయితే అనిల్‌‌‌‌ ఆంటోనీ కాంగ్రెస్‌‌‌‌ను వీడడానికి అసలు కారణం నాయకత్వం ఆయనకు సరైన అవకాశాలు కల్పించకపోవడమే. 10 సంవత్సరాలపాటు  ఒక తెలివైన స్టాన్‌‌‌‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఇంజినీర్‌‌‌‌కు కాంగ్రెస్​ఎటువంటి పని ఇవ్వలేదు. బీజేపీలో చేరిన అనిల్ ఆంటోనీని కమలం పార్టీ జాతీయ కార్యదర్శిని చేసి ఆయన  ప్రతిభను ఉపయోగించుకుంటున్నది. అది తప్పా? కాంగ్రెస్‌‌‌‌లోని అసూయతో ఉన్న నాయకులు అనిల్‌‌‌‌ ఆంటోనీకి ఏ పని ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో ఆయన హస్తం పార్టీని వీడారు. 

సమర్థతకు ప్రాధాన్యం ఇచ్చారా?

మాజీ ఎంపీ వివేక్  సౌమ్యుడు. ప్రజలకు మంచి సేవలందించారు. మనందరిలాగే, వివేక్ కూడా రాజకీయ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని భావించి ఉండవచ్చు. వివేక్​కు వేరే పార్టీలోకి వెళ్లి నాయకుడిగా ఎదిగే సొంత బలం ఉంది. ప్రస్తుత సందర్భంలో  బీజేపీ ఆయన సామర్థ్యాన్ని   ఉపయోగించుకుందని నాకు అనిపించడంలేదు. వివేక్  రాజకీయ ప్రాముఖ్యత ఉన్న కుటుంబానికి చెందినవాడు. ఉన్నత విద్యావంతుడు.  బీజేపీలో  ఏ బాధ్యత అయినా సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం ఉన్న నాయకుడు. కానీ, కమలం పార్టీ ఆయన సామర్థ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. 

ప్రమోట్​ చేస్తే పార్టీ లాభపడేది

బీజేపీలో బడుగు బలహీన వర్గాల ప్రతిభకు పెద్ద కొరత ఉంది. అయినా బీజేపీ వివేక్‌‌‌‌ని వినియోగించుకోలేదు.  బీజేపీలో చేరినప్పుడు వివేక్​ ఆ పార్టీకి అపారమైన “సాఫ్ట్ పవర్” ఇచ్చారు.  అయితే, వివేక్‌‌‌‌కు పదోన్నతి కల్పిస్తే  బీజేపీ నేతలు ఆందోళన చెందుతారు. అసౌకర్యానికి గురవుతారు. అది వారి అసమర్థతను బహిర్గతం చేస్తుంది. కేంద్ర నాయకత్వం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద దళిత నేతను ప్రమోట్ చేసి ఉండాల్సింది. బీజేపీ ఆ పని చేయలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు గవర్నర్లు, ఒక కేంద్ర మంత్రి, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలలో అనేక మంది డైరెక్టర్లు ఉన్నారు. కానీ, ఒక్క కొత్త నేతకు కూడా అలాంటి పదవి ఇవ్వలేదు. ప్రస్తుతం బీజేపీ మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అదేవిధంగా ఇంతకుముందు  బీహార్, కర్ణాటకలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే, అందుకు ఇతర పార్టీల నుంచి నాయకులను గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం వల్లనే అని చెప్పవచ్చు. తెలంగాణలో అలా జరగడం లేదు. 

సరైన నిర్ణయమే

2019లో బీజేపీకి 20శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి బీజేపీ 20శాతం దాటుతుందో లేదో వేచిచూడాలి.  కేసీఆర్‌‌‌‌పై ఉన్న కోపంతో బీజేపీని వీడుతున్నారనేది నిజం. కాంగ్రెస్‌‌‌‌కు సబ్బండ వర్గాలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫలితాలు మోదీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఏదేమైనా వివేక్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయ పార్టీలకు చెందిన మిత్రపక్షాలు మారడం సహజం. పార్టీ మారడంపై  నిర్ణయం తీసుకునే హక్కు ఓ నాయకుడికి ఉంటుంది. 

తెలంగాణలో ఎన్నికలు తృతీయ తెలంగాణ ఉద్యమ రూపం తీసుకున్నాయి.  అలాంట పుడు వివేక్​ లాంటి నాయకుడు,  బీజేపీపై అసంతృప్తితో వెళ్లాడనే కన్నా, కేసీఆర్​ను ఓడించే పార్టీలో చేరాడని ఎందుకు అనుకోకూడదు?  తెలంగాణ కోరుకుంటు న్న మార్పును గెలిపించాలనే  పట్టుదల వివేక్​లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.

ప్రతిభను మోదీ, షా గుర్తించట్లే

హిమాలయాల్లోని కైలాస పర్వతం వద్ద రాజకీయ పార్టీలు ఏర్పడటంలేదని ప్రజలకు గుర్తు చేస్తున్నాను. కొత్త ప్రతిభకు బీజేపీ హైకమాండ్​ పెద్ద మనసుతో తగిన గుర్తింపునిస్తోంది. కానీ, తెలంగాణలో నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ విధానాన్ని ఎందుకు పాటించడం లేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. 

అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మారక తప్పదు

శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాకరే సుమారు 50 సంవత్సరాలపాటు కాంగ్రెస్​ పార్టీ, గాంధీ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ధ్వజమెత్తారు.  బాల్​ థాకరే  మరణానంతరం ఆయన కుమారుడు తండ్రి బాటలోనే పయనించినా అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. కాంగ్రెస్​ పార్టీతో శివసేన స్నేహం చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. అస్తిత్వమే ప్రమాదంలో పడినపుడు శివసేన కాంగ్రెస్​తో చేతులు కలపక తప్పలేదని మనం గమనించాలి. బిహార్​ ముఖ్యమంత్రి, రాజకీయ చాణక్యుడైన నితీశ్ కుమార్​ చేసే రాజకీయ విన్యాసాల జాబితా చాంతాడంత ఉంటుంది. 

ALSO READ : కేసీఆర్​ను నిరుద్యోగులే ఓడిస్తరు : : కిషన్​రెడ్డి

ఆయన రాజకీయ కూటములను మార్చడం అనేది తరుచుగా చేసే పని. కానీ, మీడియా ఇంకా నితీశ్​కుమార్​ ఖచ్చితమైన వ్యక్తిగానే పేర్కొంటుంది. చాలామంది లెఫ్ట్ పార్టీ నేతలు వ్యక్తిగత స్నేహితులు, వారంతా నిరంతరం పొత్తుల కోసం వెతుకుతుండటంలో తప్పేమీ కనిపించడం లేదు. అయితే  అసలు ప్రశ్న ఏంటంటే రాజకీయ పార్టీలు పాత కూటమిని వదిలి కొత్తకూటమితో పొత్తు కుదుర్చుకుని మిత్రపక్షంగా మారినప్పుడు..నాయకుడు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని తను ఉంటున్న పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీలో చేరడం ఎలా తప్పవుతుంది? చాలాసార్లు నితీశ్ కూమార్​​ బిహారీ బాబుగా తన అస్తిత్వం కాపాడుకునేందుకు  కూటములు మార్చక తప్పలేదని ఎందుకు అనుకోకూడదు?

- డా.పెంటపాటి పుల్లారావు ..  పొలిటికల్​ ఎనలిస్ట్​