
- కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులను ఆదుకుంటం
- నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
- రూ.400 కోట్లతో కరకట్ట నిర్మాణానికి ఆఫీసర్ల ప్రతిపాదనలు
- సింగరేణికి మరిన్నిబొగ్గు బ్లాక్‌లు వచ్చేలా చూస్తం
- మిషన్ భగీరథలో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణ
- కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినాబొట్టు నీళ్లు రాలేదని ఫైర్
కోల్‌బెల్ట్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపుతో నష్టపోతున్న చెన్నూరు నియోజకవర్గ బాధితులను ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. ‘‘బ్యాక్ వాటర్‌తో చెన్నూరు, మంథని, మంచిర్యాల నియోజకవర్గాల్లో పంటలు, ఇండ్లు మునిగిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కారించాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల కోరాను. ఈ నేపథ్యంలోనే రూ.400 కోట్లతో కరకట్ట నిర్మాణానికి అధికారులు ప్రతిపాదన చేశారు. వర్షాకాలానికి ముందే ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కూడా ప్రయత్నిస్తాను’’ అని చెప్పారు.
మంగళవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు మున్సిపాలిటీల్లో, చెన్నూరు మండలం బావురావుపేట, పొక్కూర్గ్రామాల్లో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాల్లో వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పంపులు మునిగిపోయాయని, నాసిరకం పనుల వల్ల పిల్లర్లు పగుళ్లు తేలాయని, కేసీఆర్ రాత్రి పూట ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి కాళేశ్వరం కట్టించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు నుంచి బొట్టు నీళ్లు రాలేదని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీని చూస్తే ఏడుపొస్తున్నదని అన్నారు. మిషన్ భగీరథలో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, ఎక్కడా భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. నీరు ఎందుకు సప్లై చేయడం లేదని ప్రజాపాలనలో అధికారులను ప్రశ్నించిన ఆయన.. నెల రోజుల్లో పూర్తి స్థాయిలో నీటిసరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు.
ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్‌ను రూ.10 లక్షల పెంపు పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. అర్హులైన వారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తుందని, ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తుందని తెలిపారు. మిగతా గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని వివరించారు. అందరూ అభయహస్తం కింద దరఖాస్తు చేసుకునేలా అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు చూడాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర స్కీమ్‌లన్నీ ఆ పార్టీ వాళ్లే తీసుకున్నారని, అర్హులకు అందలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.
ప్రగతిభవన్ ఇనుప కంచెలు తొలగించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా భవన్‌గా మార్చారని, ప్రజలు స్వేచ్ఛగా అక్కడికి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తన కోసం రాజమహల్ మాదిరి ప్రగతిభవన్ కట్టుకున్నాడని, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశాడని ఆరోపించారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను వివేక్ స్వీకరించారు. ఆయన వెంట మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ మాజీ చైర్మన్మూల రాజిరెడ్డి, డీఆర్డీవో శేషాద్రి తదితరులు ఉన్నారు.
మందమర్రి, చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు
సింగరేణి సంస్థకు మరిన్ని బొగ్గు బ్లాక్స్ వచ్చేలా ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి చెప్పారు. ఓపెన్ టెండర్ విధానంలో సింగరేణికి బొగ్గు బ్లాకులు దక్కేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో 850 మెగావాట్ల మూడో యూనిట్‌ని నిర్మించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు.
సింగరేణి ఓసీపీ, పవర్ ప్లాంట్లలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. మందమర్రి, చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.