- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలలు పరిష్కస్తం
- వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలె
- చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
గోదావరిఖని : కాకా వెంకటస్వామి ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తీసుకువచ్చామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్ కె గార్డెన్ లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదారు అరకాల వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, ఐఎన్ టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక సవరణలు తీసుకువచ్చి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు నెలకొల్పామన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి తమ పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు. కక్షపూరితంగా తమపై ఈడీ దాడులు చేసిందని ఆరోపించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు.
రెండు లక్షల ఓట్ల మెజార్టీతో వంశీకృష్ణ గెలిస్తరు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీగా గెలవబోతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దొంగ దీక్షలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈశ్వర్ మంత్రిగా ఉండి రామగుండం నియోజకవర్గానికి చేసింది ఏమి లేదన్నారు. తలాపున గోదావరి ఉన్నా సాగునీరు అందించలేని ఆయనకు ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. రైతులపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాలన సాగిస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల సంభాషణలు విన్న దిక్కుమాలిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆరోపించారు. ట్యాపింగ్ లో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకెళ్లడం సిగ్గుచేటన్నారు. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీగా గెలవబోతున్నారని ఆయన దీమా వ్యక్తం చేశారు.
కాకా ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
తమ తండ్రి కాకా వెంకటస్వామి ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో రాజకీయంలోకి వచ్చానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. తెలంగాణ రాష్టం రావడం కోసం వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ప్రజల కండల్లో కారం కొట్టి రూ.45 వేల కోట్లను కేసీఆర్ కుటుంబం దోసుకున్నదని ఆరోపించారు. చిత్తశుద్ధితో పనిచేసే ప్రజలకు సేవ చేయాలన్నదే కాక వెంకటస్వామి తాపత్రయమన్నారు. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
సీఎం రేవంత్ సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పుతాని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తామన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. రామగుండం నియోజకవర్గనికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసింది ఏమి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపించారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు రెందు ఒక్కటేనన్నారు. ప్రజల ముందుకు వస్తున్న ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.