హైందవ ధర్మ రక్షణ కోసం..కంకణబద్ధులు కావాలి

  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, 
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

లక్సెట్టిపేట, వెలుగు : ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ హైందవ ధర్మ రక్షణ కోసం కంకణబద్ధులు కావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాల జిల్లా  లక్సెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. అంతకుముందు ఊత్కూర్​ చౌరస్తా నుంచి కరీంనగర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ విగ్రహాన్ని చూస్తే హిందూ ధర్మ రక్షణకు ఆయన చేసిన పోరాటం, స్ఫూర్తి గుండెల నిండా నిండిపోవాలన్నారు. ఎక్కడ దౌర్జన్యం జరుగుతుందో అక్కడ ధైర్యంగా నిలబడి న్యాయం, ధర్మం కోసం తిరగబడాలని చెప్పిన స్ఫూర్తి ప్రదాత శివాజీ మహారాజ్ అన్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం వివేక్ వెంకటస్వామి రూ.25 వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహక ప్రముఖ్​ కృష్ణ భాస్కర్, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.