
మంచిర్యాల, వెలుగు: ‘‘కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్ రివర్స్ అయింది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ రావుపై రెయిడ్స్ చేయించాలి” అని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాను బీజేపీలో ఉన్న నాలుగేండ్లూ కేసీఆర్ అవినీతి, అక్రమాలపై పోరాడానని, ఆ రెండు పార్టీలు ఒక్కటి కావడంతోనే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. పార్టీ మారడం వల్లే తనపై ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘‘నేను బీజేపీలో ఉన్నప్పుడు కేసీఆర్అవినీతిపై ఫిర్యాదు చేసినా అమిత్ షా స్పందించలేదు.. కానీ పార్టీ మారిన వెంటనే నాపై ఐటీ, ఈడీని పురికొల్పి సోదాలు జరిపించారు” అని అన్నారు.
‘‘నేను నీతి, నిజాయితీగా ఉండే వ్యక్తిని. నా సంస్థల నుంచి ప్రభుత్వాలకు రూ.10 వేల కోట్ల టాక్స్ కట్టిన. ఎన్ని సోదాలు చేసినా... నా దగ్గర ఇల్లీగల్ ఏమీ లేవు. ఎంతదూరమైనా ఫైట్ చేయడానికి సిద్ధం” అని స్పష్టం చేశారు. శుక్రవారం వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి రూ.12 కోట్లు లోన్ తీసుకున్న. రూ.7 కోట్లు తిరిగి చెల్లించిన. చట్ట ప్రకారమే లావాదేవీలు జరిగాయి. కానీ ఈడీ అధికారులు నేను ఫెమా, ఫెరా రూల్స్ ఉల్లంఘించినట్టు ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన్రు. ఈ సంస్థ షేర్ల అమ్మకం ద్వారా రూ.50 కోట్లు వస్తే... ప్రభుత్వానికి రూ. 9 కోట్ల టాక్స్ కట్టినం. ఈ విషయాన్ని ఈడీ ఎందుకు చెప్పలేదు. విజిలెన్స్ సంస్థపై, తప్పుడు ఆరోపణలు చేసిన దర్యాప్తు అధికారులపై పరువు నష్టం దావా వేస్తా” అని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయని వివేక్ ఫైర్ అయ్యారు. ‘‘బీజేపీ కేసీఆర్ చెప్పుచేతల్లో ఉంది. అందుకే కేసీఆర్ అవినీతిపై అమిత్‌షాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలే. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వారం రోజుల్లో నేను అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించిన. అయితే, బీఆర్ఎస్కు మేలు చేసే ఉద్దేశంతో మేనిఫెస్టోను ఖమ్మంలో ప్రకటిస్తాం.. ఆదిలాబాద్‌లో రిలీజ్ చేస్తామంటూ అమిత్ షా డిలే చేసిండు” అని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 85 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ 20 సీట్లకు మించి గెలవదన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
‘‘కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదంటూ ప్రజలను కేసీఆర్ తప్పుదారి పట్టిస్తున్నడు. 2004లో ఉచిత కరెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. కేసీఆర్ రైతులను కోటీశ్వరులు చేస్తానని చెప్పి ఆయనే కోటీశ్వరుడు అయ్యిండు. బంగారు తెలంగాణ పేరుతో తనకుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా చేసుకున్నడు. తుగ్లక్ సీఎం పుస్తకాలు చదివి కాళేశ్వరం కడితే బ్యారేజీలు పేకమేడలా కుంగిపోయినయ్. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పేరిట రూ.లక్ష కోట్లకు పైగా లూటీ చేసిండు. సీఎం కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలె. అప్పుడే నిజాలు బయటకు వస్తయ్” అని వివేక్ వెంకటస్వామి అన్నారు.