ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు : వివేక్ వెంకటస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విసుగుచెందారని బీజేపీ చేపట్టిన ఇంటింటి ప్రచారంలో వెల్లడైందని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాక ముందు రూ.10వేల కోట్లున్న లిక్కర్ ఆదాయాన్ని.. ఇప్పుడు రూ.40 వేల కోట్ల ఆదాయానికి చేర్చిన ఘనుడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు గానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందన్నారు. సంస్థాన్ నారాయణపురంలో చేపట్టిన ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో వివేక్ వెంకట స్వామి మాట్లాడారు.   

సీఎం కేసీఆర్ తన అవసరం కోసం ఏమైనా చేస్తారని, అవసరం తీరాక ఎంతటి వారినైనా బయటకు నెట్టేస్తారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున వివేక్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ప్రజలు, ఉద్యమకారులు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఎందరో ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపించారని చెప్పారు.