క్యాతనపల్లి మున్సిపాలిటి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది మున్సిపల్ కార్యవర్గం. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ 28 నుంచి అన్ని గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ప్రజల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు వివేక్ వెంకటస్వామి.
అంతకుముందు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆసుపత్రిని సందర్శించి సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది తో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అనునిత్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సర్జికల్ ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన సామగ్రి లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి త్వరలోనే సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి కలియ తిరిగారు. విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. చెన్నూర్ పట్టణంలో యాక్సిడెంట్ కు గురైన కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించారు. చెన్నూర్ ఎమ్మెల్యేగా వివేక్ గెలిస్తే తానెత్తు బంగారంతో సమ్మక్క సారలమ్మకు మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్న మల్లేశ్వరి... వివేక్ ఆధ్వర్యంలో మొక్కును చెల్లించుకుంది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.