కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోనే సీఎం కేసీఆర్ నిద్ర లేచారని మునుగోడు ఉపఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఓట్ల కోసం కొత్త పథకం పన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రాజ్యసభ సీట్లను ఆమ్ముకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు విలువ లేదన్నారు. డబ్బుతో కేసిఆర్ ని కలిస్తే వాళ్లకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దోపిడీకి పాల్పడిన ముఖ్యమంత్రి.. పాత వాటర్ ట్యాంక్ లకు కలర్ వేసి తానే అపర భగీరథుడని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు
మునుగోడు నియోజకవర్గం లో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. GHMC ఎన్నికల్లో ఓట్లకోసం వరదల్లో నష్టపోయిన బాధితులకు ఒక్కొ్క్కరికి రూ.10,000 ఇస్తానని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లో ఉప ఎన్నికలు అయిపోయాక అక్కడి ప్రజలను కనీసం పట్టించుకోలేదన్నారు. చర్లగూడెం, డిండి భూ నిర్వాసితులకు పరిహారం అందకపోవడంతో స్థానికులు ఇంకా ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు కి బడ్జెట్ లో నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే
తుగ్లక్ సీఎం కేసీఆర్ రాత్రికి ఎదో ఆలోచిస్తారు.... ఉదయం ఒకలా ఉంటారని వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 8 ఏండ్లు అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి అమలుకాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అభిషేక్ రావు ఎమ్మెల్సీ కవితకి బినామీ అని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. ప్రజలపై భారం వేసి కేంద్రం పై ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత డబ్బుతో మునుగోడును రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి చేసిన్రు
టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఓట్లకోసం వచ్చే కేసీఆర్ ను ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత డబ్బుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విషయం ప్రజలకు తెలుసు అన్నారు. మంత్రి KTR అభద్రతతో మాట్లాడుతున్నారన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి రూ.18 లక్షల కోట్ల స్కామ్ చేశారని..దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.