
కోల్ బెల్ట్, వెలుగు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి బస్టాండ్ ఆవరణలో రూ.18 లక్షల ఫండ్స్ తో నిర్మించనున్న మోడ్రన్ టాయిలెట్స్ పనులకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలతో కలిసి ఆదివారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్టాండ్ లో నెలకొన్న సమస్యలను ఎన్నికల ప్రచారం సందర్భంగా తన దృష్టికి తీసుకువచ్చారని, వారి కోరిక మేరకు మోడ్రన్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.
తమ తండ్రి కాకా వెంకటస్వామి మందమర్రిలో బస్టాండ్‌కు ఫౌండేషన్ వేశారని, అప్పటి నుంచి బస్టాండ్ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. కొత్తగా జిల్లాకు రెండు హైటెక్ బస్సులు మంజూరయ్యాయని, అందులో ఒకటి చెన్నూరు నుంచి హైదరాబాద్‌కు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, సీఐ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వివేక్
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కందుల చంద్రయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.