- గోదావరి మనకు జీవనది..
- కన్న తల్లిలా భావిస్తమని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ‘గోదావరి పరిరక్షణ’ను చేరుస్తం: మురళీధర్‌రావు
- గోదావరి పుష్కర ఘాట్‌లో ‘మహా హారతి’
జగిత్యాల/ధర్మపురి, వెలుగు: జల వనరులతోనే మానవ మనుగడ సాగుతుందని, నదులను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి పుష్కర ఘాట్ క్షేత్రంలో ‘గోదావరి మహా హారతి’ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ హాజరయ్యారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘గోదావరిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాష్ట్రంలో గోదావరి ప్రవేశించే కందకుర్తి నుంచి హారతి యాత్ర ప్రారంభించి.. మూడో రోజు ధర్మపురికి చేరుకున్నాం. తెలంగాణలో 479 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నది. తెలంగాణ అంటే గోదావరి గోదావరి అంటే తెలంగాణగా పేరు గాంచింది. మనకు జీవనది. కన్న తల్లిలా భావిస్తాం అందుకే ఏటా గోదావరి హారతి ఘనంగా నిర్వహిస్తాం” అని చెప్పారు. ధర్మపురి డ్రైనేజీ నీరంతా గోదావరిలో కలవడంతో నది కలుషితమవుతున్నదని, మూసీ నదిలా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆవులను రాయితీపై అందించాలి: మురళీధర్ రావు
ప్రభుత్వం ఆవులను రాయితీపై అందించాలని మురళీధర్ రావు డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో గోశాల నిర్మాణం చేపట్టాలన్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో గోదావరి పరిరక్షణ ఉంటుందన్నారు. పంట పొలాల్లో రసాయన ఎరువులను వినియోగించడంతో అవి తిరిగి నదిలో చేరి నీరు కలుషితం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నదులను రక్షించకపోతే నాగరికత కనుమరుగవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో గోదావరి కూడా మూసీ నదిలా మారే ప్రమాదం ఉందని, గోదావరిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.