- ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించారు
కోల్బెల్ట్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకస్వామి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను ఆదరించారని, దీంతో రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన పలు కార్యక్రమాలకు వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. అందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను పక్కనబెట్టి కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.
ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతూ అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నేత దుర్గం నరేశ్, ఐఎన్టీయూసీ బెల్లంపల్లి రీజియన్ ఇన్‌చార్జి కాంపెల్లి సమ్మయ్య, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, లీడర్లు గుడ్ల రమేశ్, పైడిమల్ల నర్సింగ్, ఓడ్నాల కోమురయ్య, పాషా, ఎర్రరాజు, మహంత్ అర్జున్, కిరణ్, సురేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు వివేక్ పరామర్శ
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సోమవారం సాయంత్రం మందమర్రి పట్టణంలో నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన మైసూర్ బేకరీని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక సింగరేణి సీఈఆర్ క్లబ్లో జరిగిన మాజీ పాత్రికేయుడు హెచ్.రవీందర్తల్లి హన్మండ్ల ఈశ్వరమ్మ దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈశ్వరమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎండీ ఖలీల్ అనారోగ్యంతో చనిపోగా ఆ బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. రాజన్నలవాడకు చెందిన మదిరే శ్యామ్ సుందర్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.