
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం: వివేక్ వెంకటస్వామి
- కాళేశ్వరం ముంపు సమస్యకు ఏడాదిలోగా పరిష్కారం
- కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు నిర్వహించి తిన్నదంతా కక్కిస్తాం
- సింగరేణి ఓసీపీలు, ఎస్టీపీపీలో స్థానికులకే ఉద్యోగాలు
- ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలతో పేదలకు కార్పొరేట్ వైద్యం
- చెన్నూరులో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ స్కీంలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మంచిర్యాల/శామీర్‌పేట, వెలుగు: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, వంద రోజుల్లో వాటిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు హైస్కూల్ గ్రౌండ్‌లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీతో లక్షల మంది ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం పొందారని గుర్తుచేశారు. ‘‘రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. కరోనా సమయంలో రూ.లక్షల్లో ట్రీట్‌మెంట్ ఖర్చులు చెల్లించలేక పేదలు ఇబ్బందులు పడ్డారు. వారికి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని కేసీఆర్‌ను కోరినా పట్టించుకోలేదు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్ప ప్రజల గురించి ఆలోచన చేయలేదు”అని విమర్శించారు. వైద్య ఖర్చులు పెరిగినందున రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ ట్రీట్‌మెంట్ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు సమస్యకు ఏడాదిలోగా పరిష్కారం చూపుతామని వివేక్ భరోసా ఇచ్చారు. దర్యాప్తులో ముంపు అంశాన్ని కూడా చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెంత తిన్నారో అంతా కక్కిస్తామన్నారు.
స్థానికులకే ఉద్యోగాలు..
సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ల్లో, జైపూర్ ఎస్టీపీపీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని వివేక్ హామీ ఇచ్చారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జీవో ఇప్పించా.. కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని పక్కనపెట్టింది. కాంట్రాక్టర్లు బయటి వారిని తీసుకొచ్చి ఉద్యోగాల్లో పెట్టుకున్నరు. దీంతో స్థానిక నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగింది”అని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయమై త్వరలోనే కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. మరోవైపు, చెన్నూరు హాస్పిటల్‌ను బలోపేతం చేస్తామని, డాక్టర్లు, స్టాఫ్‌ను నియమించి హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లభించే ట్రీట్‌మెంట్ ఇక్కడ అందిస్తామని వివేక్ చెప్పారు. హెల్త్ మినిస్టర్‌తో మాట్లాడి అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండు..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాజీ సీఎం కేసీఆర్ నాశనం చేశారని వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు బయలుదేరిన ఆయనకు మేడ్చల్ జిల్లా హకీంపేట వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి గుడిలో వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించి, మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కేసీఆర్ రాక్షస పాలనను దించాలన్న ఆకాంక్ష నెరవేరిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు హామీలను అమలు చేసినట్లు తెలిపారు. ప్రజలను దోచుకున్న వారి నుంచి ప్రతి పైసా కక్కించాలని సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కోరినట్లు ఆయన తెలిపారు.
వారానికి మూడ్రోజులు చెన్నూరులోనే ఉంటా..
‘‘నేను వారానికి మూడ్రోజులు చెన్నూరులో ఉంటా. క్యాంప్ ఆఫీస్‌లో ఉదయం 6 గంటలకే అందుబాటులో ఉంటా. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా అక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు”అని వివేక్ అన్నారు. చట్ట వ్యతిరేకమైన పనులు చేయాలని తాను చెప్పనని, చట్ట పరిధిలో ఉన్న పనులపై మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని అధికారులను హెచ్చరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్లను రిలీజ్ చేసిన అనంతరం బస్సులో మహిళలతో కలిసి ఆయన ప్రయాణించారు. అంతకుముందు నియోజకవర్గంలో 383 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా, ఐదుగురికి వివేక్ చేతుల మీదుగా అందజేశారు. డిసెంబర్ 3 తర్వాత అప్లై చేసుకున్న వారికి రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, హైకోర్టు అడ్వొకేట్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.