సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలి: వివేక్ వెంకటస్వామి

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో యూనియన్ నాయకులు వివేక్ ను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 27 వేల కోట్ల రూపాయల బాకీ చేసి నష్టాల్లోకి తీసుకెళ్లిందన్నారు.  సింగరేణిలో లోకల్ కాంట్రాక్టు కార్మికులు, లోకల్ కాంట్రాక్టర్లు ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాల కోసం గతంలో కాంగ్రెస్  జారీ చేసిన జీవోను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామన్నారు. సింగరేణి నిధులు సింగరేణి ప్రాంతంలోనే ఖర్చు చేసేలా చూస్తామన్నారు.  జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు వివేక్. 

తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు వివేక్ వెంకటస్వామి.  చెన్నూరు ప్రజల ఆకాంక్ష మేరకు తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు. ఆరు గ్యారంటీల పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారని..వాటిని అమలు చేస్తామన్నారు.  ప్రగతి భవన్ ముందు ఇనుప కంచె తొలగించడంతో ప్రజలు సంతోషపడ్డారని చెప్పారు.  

 ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి.. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ పై 37,515 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.