మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిదే గెలుపు : వివేక్ వెంకటస్వామి

నల్లగొండ జిల్లా :- మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు మొత్తం మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చు చేసి, ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆధారాలు లేకుండా టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో అసలైన కమ్యూనిస్టులు ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు నేతలు మాత్రం డబ్బుల కోసం టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దిగజారి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్.. యాదగిరిగుట్ట దేవాలయంలో దేవుడి సమక్షంలో చర్చకు సిద్ధమా..? అని వివేక్ వెంకట స్వామి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కి తెలంగాణ ద్రోహులను వెంటబెట్టుకొని కేసీఆర్ తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని తామే అభివృద్ధి చేశామని చెబుతున్న టీఆర్ఎస్ కు .. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ఇంత బలగం ఎందుకు..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కు వచ్చిన జనాన్ని చూసి టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యమన్నారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా మునుగోడు మండల కేంద్రంలో శాలివాహన సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా పని చేయాలని శాలివాహన సంఘం నాయకులు నిర్ణయం తీసుకున్నారు.