తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ, రాక్షసపాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి చెప్పారు. కమీషన్ల కోసమే కేసీఆర్ తాపత్రయం అన్నారు. ధర్మపురి క్షేత్రం అభివృద్ధికి కేటాయించిన రూ.500 కోట్ల నిధుల జాడేది అని ప్రశ్నించారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం నిలువునా దోచుకుంటోందని ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీజేపీ సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి ధర్మపురి ప్రజలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
దేశంలో నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇండ్లు నిర్మించి.. ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే అని వివేక్ వెంకటస్వామి చెప్పారు. భారత్ ను ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలపాలని ప్రధాని మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. రైతులకు కావాల్సిన ఫర్టిలైజర్స్ పై ఒక ఎకరానికి కేంద్రప్రభుత్వం రూ.18 వేల సబ్సిడీ అందిస్తోందన్నారు. రామగుండం ఎఫ్ సీఐతో ఎరువుల కొరత తీరిందన్నారు. కోవిడ్ సమయంలో ప్రధాని 200 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా పంపిణీ చేశారని గుర్తు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన అయుష్మాన్ భారత్ పథకం ద్వారా నిరుపేదలకు రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతోందన్నారు.