
- సింగరేణిలో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తాం: వివేక్ వెంకటస్వామి
- సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలి
- కార్మికులు సంతోషంగాఉంటే రాష్ట్రం బాగుంటుంది
- కార్మిక నేతల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే కామెంట్
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపిస్తే, కొత్త గనులు తీసుకొచ్చి.. మరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీసులో యూనియన్ ముఖ్య నేతలతో సమావేశమై, గుర్తింపు సంఘం ఎన్నికలపై చర్చించారు. వివేక్‌తో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల అవసరాలు తీర్చుతూ అండగా ఉంటుందని చెప్పారు. సింగరేణి కార్మికులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు చేసిన సమ్మె.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్నితెలంగాణ ఏర్పాటు అంశంపై ఆలోచించేలా చేసిందన్నారు. కోల్ బెల్ట్‌లోని కార్మికులు 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి చెంప దెబ్బ కొట్టారన్నారు.
కొత్త గనులు, ఉద్యోగాలు రావాలి..
సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించబోమని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో చెప్పారని గుర్తుచేశారు. సింగరేణి ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే కొత్త గనులు, ఉద్యోగాలు రావాల్సి ఉందన్నారు. 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని.. 100 మిలియన్ టన్నులకు పెంచాల్సి ఉందని తెలిపారు. సింగరేణి సంస్థ రూ.వేల కోట్ల లాభాల్లో ఉందని, బయట అందరు అనుకుంటున్నారని, కానీ, ఇక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కార్, టీబీజీకేఎస్ నిర్లక్ష్యంతో సంస్థ అప్పుల పాలైందని ఆరోపించారు. నిధుల్లేకపోవడంతో కొత్త గనులు తవ్వలేకపోయారని, కనీసం కార్మికులకు కొత్త క్వార్టర్స్ కూడా నిర్మించలేని దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. సింగరేణికి రావాల్సిన రూ.27 వేల కోట్ల బకాయిలను సర్కారు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
బీఐఎఫ్ఆర్ నుంచి కాపాడింది కాకానే..
సింగరేణి సంస్థ నష్టాలతో బీఐఎఫ్ఆర్‌లో ఉన్నప్పుడు తన తండ్రి కాకా వెంకటస్వామి ప్రధాని పీవీ నర్సింహా రావుతో మాట్లాడి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు ఇప్పించారని వివేక్ గుర్తుచేశారు. ఆయన చొరవతో 1.20 లక్షల మంది కార్మికులకు మేలు జరిగిందని చెప్పారు. కార్మికులు, ఉద్యోగులకు కాకా పెన్షన్ విధానాన్ని కల్పించారని తెలిపారు. సింగరేణి కార్మికులు, చెన్నూరు, బెల్లంపల్లి ప్రజలకు కాకా అందించిన సేవలే తమను ఎమ్మెల్యేలుగా గెలిపించాయన్నారు. అనంతరం టీబీజీకేఎస్ లీడర్లకు కండువా కప్పి ఐఎన్టీయూసీలోకి వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి మద్దతు ఇస్తున్నట్లు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్అసోసియేషన్, టీఎన్టీయూసీ ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కాంపెల్లి సమ్మయ్య, సిద్ధంశెట్టి రాజమొగిలి, దేవి భూమయ్య, నరేందర్, మండ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్స్ ఇప్పిస్తాం..
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కూడా క్వార్టర్స్ ఇప్పిస్తామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఓసీపీలు, పవర్ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని తాను సీఎం రేవంత్‌రెడ్డికి చేసిన విజ్ఞప్తికి స్పందించి, ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు వివేక్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాదిరిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సింగరేణి సంస్థలో జోక్యం చేసుకోబోరని స్పష్టం చేశారు. యాజమాన్యం కార్మికులను ఇబ్బంది పెడితే పోరాటం చేస్తామన్నారు. ఆర్థికంగా సంస్థను బలోపేతం చేయడంతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై యాజమాన్యంతో మాట్లాడానన్నారు. 850 మెగావాట్లతో జైపూర్ ప్లాంట్‌లో మూడో యూనిట్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.