
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజా సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఆ పార్టీ వాళ్లే అక్రమంగా తీసుకున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలనలు జరిపి.. అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందడం చాలా ఇబ్బందికరంగా మారింది.. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను 10 లక్షలకు పెంచామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.
సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్ 850 మెగావాట్ల మూడో యూనిట్ ని నిర్మించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. మందమర్రిలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తదని చెప్పారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ కార్యాలయంలో ఆరు గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా, రెవెన్యూ అధికారులు అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు.