రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం.. తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తాం : వివేక్ వెంకటస్వామి

రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం..  తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తాం : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి చెప్పారు. గత ఏడాది కూడా బీజేపీ అధ్వర్య్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవం వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారని చెప్పారు.

తెలంగాణలో రోజురోజుకు బీజేపీకి మరింత ఆదరణ పెరుగుతోందన్నారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే చాలామంది నాయకులు రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దాదాపు ఆరువేలకు పైగా ఎమ్మెల్యే అప్లికేషన్స్ వచ్చాయన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వరంలో పార్టీ ముందుకెళ్తోందన్నారు. అంతకుముందు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను ఎదుర్కొన్నామని, ఆ ఎలక్షన్స్ లలో ఇతర పార్టీలకు బీజేపీ గట్టి పోటీనిచ్చిందన్నారు. ఫస్ట్ టైమ్ మునుగోడులో 87 వేలకుపైగా ఓట్లు బీజేపీకి వచ్చాయన్నారు. 

ప్రధాని మోడీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. రాష్ర్టంలో తప్పనిసరిగా బీజేపీ జెండా ఎగురుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. ప్రపంచంలో గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...జీ 20 సదస్సును సక్సెస్ చేశారని చెప్పారు. జీ 20  సదస్సు ద్వారా భారత్ గొప్పదేశమని ప్రధాని మోదీ మరోసారి చాటారని అన్నారు. జమిలి ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతోందన్నారు.