- రూ.5 లక్షల కోట్లు ఇచ్చినా ఇవ్వలేదనడం ఏమిటి?
- మంచిర్యాలలో పర్యటన
మంచిర్యాల/ ధర్మపురి, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నిధులు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఫండ్స్ ఇవ్వడం లేదని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క నేషనల్ హైవేస్ నిర్మాణానికే రూ.లక్ష కోట్లకు పైగా ఫండ్స్ కేంద్రం ఇచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా 3.18 కోట్ల ఇండ్లను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టించలేదన్నారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం సాయంత్రం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు.
గత తొమ్మిదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఎదిగిందన్నారు. కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలమైనప్పటికీ ఇండియాను 7.2 జీడీపీ వృద్ధిరేటుతో ముందంజలో నిలిపిన ఘనత మోదీకి దక్కుతుందని చెప్పారు. రైతులకు యూరియాపై ఎకరానికి రూ.18 వేల సబ్సిడీని కేంద్రం ఇస్తున్నదని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని, బీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు, ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జువ్వాడి కుటుంబానికి పరామర్శ
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సతీమణి సుమతి ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. జువ్వాడి కుమారులు నర్సింగరావు, కృష్ణారావు, శేఖర్ రావును కలిశారు. సుమతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వివేక్ వెంకటస్వామి వెంట బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, ధర్మపురి నియోజకవర్గ బీజేపీ నేతలు ఉన్నారు.