బల్దియాలో ఎగిరేది బీజేపీ జెండానే

బల్దియాలో ఎగిరేది బీజేపీ జెండానే

హైదరాబాద్, వెలుగుప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ కోర్‌‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తండ్రీ కొడుకులకు జనమే తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, వాళ్లు మాత్రం ఫాంహౌస్​లు కట్టుకున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్లందరి గొంతు కోసిండు కేసీఆర్. కేవలం కుటుంబ ఆస్తులను పెంచుకోవడానికి రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిండు” అని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా శనివారం షేక్​పేట్, లంగర్ హౌస్ లో బీజేపీ క్యాండిడేట్లకు మద్దతుగా వివేక్ ప్రచారం చేశారు. షేక్​పేట్​లోని సీతానగర్, హరిజన బస్తీ, వినాయక్ నగర్ లో ఇంటింటికి తిరిగి బీజేపీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు వివేక్ కు హారతులు పట్టి ఆహ్వానించారు. బీజేపీకి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా షేక్ పేట్ బీజేపీ అభ్యర్థి చేర్క మహేశ్​తో కలిసి వివేక్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కోసం ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే.. ఈ ముఖ్యమంత్రి అవినీతితో రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని మండిపడ్డారు.

దుబ్బాకలో హరీశ్​కు.. బల్దియాలో కేటీఆర్​కు..

ఎంఐఎంతో టీఆర్ఎస్ రహస్య పొత్తు పెట్టుకుందని వివేక్ ఆరోపించారు. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూలుస్తామని ఒవైసీ అంటుంటే.. కేసీఆర్ ఎందుకు సైలెంట్​గా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒవైసీ సోదరుల నోర్లు మూయించే బాధ్యత కేసీఆర్ దేనన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్ల పైనే గెలుస్తుందని, టీఆర్ఎస్ కేవలం 15 సీట్లకు పరిమితం కానుందన్నారు. దుబ్బాకలో హరీశ్ రావుకు ఎదురైన చేదు అనుభవమే బల్దియాలో కేటీఆర్ కు ఎదురవుతుందని, ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మార్పు కోసం  బీజేపీని ఆదరించండి

మార్పు కోసం ఈ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ఓటర్లకు వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. గ్రేటర్​లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు డ్రైనేజీలు బాగు చేయించాలని అడుగుతున్నారని, డ్రైనేజీలను బాగు చేసేందుకు 10 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు, మెట్రో పాసులు ఇస్తామని తెలిపారు. యువతకు, స్టూడెంట్లకు ఉచితంగా ల్యాప్​టాప్​లు అందజేస్తామన్నారు.