ఎన్ హెచ్ 63 విస్తరణతో తీవ్ర నష్టం

ఎన్ హెచ్ 63 విస్తరణతో తీవ్ర నష్టం
  • దానికి బదులుగా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్​ 
  • మీదుగా బైపాస్ వేయండి
  • గడ్కరీకి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు : మంచిర్యాల అసెంబ్లీ పరిధి లోని ఎన్ హెచ్ -63 రోడ్డు విస్తరణతో స్థానికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇందుకు బదు లు ప్రత్యామ్నాయంగా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్​ మీదుగా బైపాస్  వేయాలని ప్రజలు చేస్తున్న విజ్ఞప్తిని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ నేతలతో కలిసి వివేక్ మంగళవారం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్  గడ్కరీతో భేటీ అయ్యారు. ఎన్​హెచ్-63 నిర్మాణంతో లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ ప్రజలకు జరగనున్న నష్టంపై మంత్రికి ఆయన ఫిర్యాదు చేశా రు. ఈ విస్తరణలో పెద్ద మొత్తంలో ఇండ్లు, పంట పొలాలు పోతున్నాయని మంత్రికి వివరించారు.

అనంతరం వివేక్  మాట్లాడుతూ... నూతన నిర్మాణంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎక్కువ మొత్తంలో ఇండ్లు, పంట పొలాలు పోతున్నాయన్నారు. ప్రస్తుత ప్రతిపాదిత మార్గానికి ప్రత్యామ్నాయంగా బైపాస్  మార్గంలో రహదారిని మళ్లించాలన్న ప్రజల విజ్ఞప్తిని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమ విజ్ఞప్తిపై గడ్కరీ తక్షణమే స్పందించారని, ఎన్ హెచ్ నిర్మాణంపై రీసర్వే చేయించాలని అధికారులకు సూచించారని వివేక్   వివరించారు. ప్రజలకు జరుగుతున్న నష్టం, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారన్నారు. ప్రజా సమస్యలపై స్పందించి న కేంద్ర మంత్రికి మంచిర్యాల ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, లక్సెట్టిపేట మునిసిపల్ బీజేపీ అధ్యక్షుడు హర గోపాల్, 3మండలాల బాధితులు ఉన్నారు.