మహిళా రిజర్వేషన్​ బిల్లు చరిత్రాత్మకం: వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్/ జగిత్యాల,  వెలుగు: చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్​ బిల్లు తీసుకొచ్చిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని బీఎంఎస్​ ఆఫీస్​లో బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి అందుగుల శ్రీనివాస్​ దంపతుల ఆధ్వర్యంలో 200 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వివేక్​వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా లోక్​సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. 

తెలంగాణలో ఆరుగురు మహిళలకు ఎంపీలుగా, 39 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తుందన్నారు. కరోనా టైమ్​లో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం అందించిన ఘనత మోదీదేనన్నారు. రూ.45 వేల కోట్లు వెచ్చించి ఉచితంగా వ్యాక్సిన్లు​ఇచ్చినట్టు గుర్తుచేశారు. తమ తండ్రి వెంకటస్వామి ఎన్టీపీసీ ద్వారా రుణాన్ని తీసుకొని నష్టాల్లో ఉన్న సింగరేణిని నిలబెట్టారన్నారు. అనంతరం పలువురు యువకులు వివేక్​ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్​ దీక్షితులు, నాయకులు అక్కల రమేశ్, సప్పిడి నరేశ్, డొనికేన రమేశ్​గౌడ్, గడ్డం శ్రీనివాస్, సురేందర్, మార్త కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

ప్రపంచమంతా భారత్​ వైపు చూస్తున్నది 

ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచమంతా భారత్​ వైపు చూస్తున్నదని వివేక్ వెంకట స్వామి అన్నారు. భారత పౌరులందరూ ఐక్యంగా ఉండి దేశ ప్రతిష్టను చాటాలన్నారు. ఇటీవల భారత్​అధ్యక్షతన జీ20 సమావేశాలు జరిగాయని, ఇదంతా మోదీ ఘనతేనన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బుధవారం వివేక్ వెంకట స్వామి పర్యటించారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో మేరా మాటీ మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా మట్టిని సేకరించారు. అనంతరం 30 మంది యువకులు బీజేపీలో చేరగా.. వారికి వివేక్​కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

వెల్గటూర్ మండలం రాజారాంపల్లి, గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్,  బుగ్గారం మండలం సిరికొండలో పలువురు మరణించగా వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు, రాజారాంపల్లి ఎంపీటీసీ గాజుల మల్లేశం, నేతలు కాడే సూర్య నారాయణ, కస్తూరి సత్యం, కొమ్ము రాంబాబు, న్యాతరి మల్లేశం, ప్రమోద్, కందికట్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.