
హైదరాబాద్, వెలుగు: తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్ వెంకటేశ్ హనుమంతరావు దేశాయ్ (వీహెచ్ దేశాయ్) జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిటీలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బేగంపేటలోని రామనంద తీర్థ మెమోరియల్ కమిటీ హాల్లో వీహెచ్ దేశాయ్ ఆటో బయోగ్రఫిపై రాసిన ‘ది అన్సంగ్ హీరో, హైదరాబాద్ ఫ్రీడమ్ స్ట్రగుల్’ బుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ బుక్‌ను వీహెచ్ దేశాయ్ కొడుకులు వివేకానంద దేశాయ్, సుభాశ్ దేశాయ్ కలిసి రాశారు. ఈ ప్రోగ్రామ్‌కు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వీహెచ్ దేశాయ్ పాత్ర మరువలేనిది అన్నారు. జర్నలిస్ట్‌గా ‘జై తెలంగాణ’ పేరుతో పత్రికను స్థాపించి ఉద్యమం పట్ల ప్రజలను చైతన్యవంతులు చేశారని తెలిపారు. ‘బ్రేక్ బట్.. నాట్ బెండ్’ అని వీహెచ్ దేశాయ్ ఇచ్చిన నినాద స్ఫూర్తితో వెలుగు పత్రికను, వీ6 న్యూస్ చానెల్‌ను నడుపుతున్నట్లు వివేక్ వివరించారు. వెంకటస్వామి (కాకా), దేశాయ్ మంచి స్నేహితులని, వీరిద్దరి టీమ్ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి మెమొరాండం ఇచ్చిందని గుర్తుచేశారు. వీహెచ్ దేశాయ్ జీవిత చరిత్రను బుక్ రూపంలో తీసుకొచ్చినందుకు ఆయన కొడుకులకు వివేక్ అభినందనలు చెప్పారు. దేశాయ్ కుటుంబ సభ్యులతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, వీహెచ్ దేశాయ్ తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు.
సీఎం కేసీఆర్‌తో మాట్లాడి.. హైదరాబాద్‌లో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశాయ్ జీవిత చరిత్ర బుక్ రూపంలో తీసుకొచ్చినందుకు ఆయన కొడుకులకు వక్తలు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ వీసీ సీతారామ రావు, ప్రజ్ఞా భారతి చైర్మన్ టీహెచ్ చౌదరి, వీహెచ్ దేశాయ్ కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.