కేంద్రం ఇచ్చిన రూ.7 వేల కోట్ల కరోనా నిధులు ఇరిగేషన్‌కు: వివేక్
సీఎం కేసీఆర్కు మాయమాటలు చెప్పడం, మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రాణహిత నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడినుంచి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని తన తండ్రి కాకా వెంకటస్వామి అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి రూ.37 వేల కోట్లు తీసుకువచ్చారన్నారు. అందులో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారని, ఆ నిధులతోనే నీళ్లు వచ్చాయని చెప్పారు. కానీ ఈ రోజు కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు వ్యయం రూ.37 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పోయిందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ చేపట్టారని విమర్శించారు. కొండపోచమ్మకు కాళేశ్వరం జలాలంటూ కేసీఆర్ పూజలు చేశారని, కానీ ఆ నీళ్లు ఎల్లంపల్లి నుంచి వచ్చాయన్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం రూ.7 వేల కోట్లు ఇచ్చిందని, కానీ ఆ నిధులను ఇరిగేషన్‌కు డైవర్ట్ చేసి కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అప్పులు చేసి కొన్ని పథకాలకు డబ్బులు ఇస్తూ ఓటు రాజకీయం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుని, కానీ కేసీఆర్ మద్యం ఇస్తూ వారందరినీ తాగుబోతులను చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మేల్యేలు బొడిగె శోభా, సోమారపు సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
For More News..