రాష్ట్రవ్యాప్తంగా కాకా క్రికెట్ టోర్నీ : వివేక్‌‌ వెంకటస్వామి

  • సెప్టెంబర్ నుంచి నిర్వహిస్తాం: వివేక్‌‌ వెంకటస్వామి
  • గ్రామీణ క్రీడాకారులను జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యం 
  • పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందని వెల్లడి
  • ఇక్కడి క్రికెట్‌‌ ప్లేయర్లను ఇండియా జట్టుకు ఆడించడమే టార్గెట్‌‌: వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఏటా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నీ ఎంతో దోహదపడుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామీణ క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఆడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్ టోర్నీలో గెలుపొందిన టీమ్స్‌‌కు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణతో కలిసి వివేక్‌‌ బహుమతులు అందజేశారు. 

వివేక్​మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నీలో ప్లేయర్లు పోటీతత్వంతో ఆడటం సంతోషంగా ఉందన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో క్రికెట్ టోర్నీ నిర్వహించాలనే కోరిక తీరిందన్నారు. యువనేత వంశీకృష్ణ ఆలోచన ప్రకారం సెప్టెంబర్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. తాను హెచ్‌‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో టర్ఫ్ వికెట్‌‌పై గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. 

హైదరాబాద్‌‌లో ఉప్పల్ స్టేడియం కట్టేందుకు డబ్బులిచ్చామని, రూల్స్‌‌ ప్రకారం తమకు స్పానర్స్‌‌షిప్ రైట్స్ ఇవ్వాల్సి ఉండేదన్నారు. కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, విశాక ఇండస్ట్రీస్‌‌కు ఒప్పందం ఉన్నా కూడా అప్పటి హెచ్‌‌సీఏ కమిటీ తమ రైట్స్ లాగేసుకుందని గుర్తుచేశారు. మా సంస్థ పేరు తీసేశారని, నష్ట పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీకి మంచి మనీ ప్రైజ్ ఇస్తామని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడించడమే కాకా ఫౌండేషన్ లక్ష్యమన్నారు. 

ఫైనల్ చేరిన చెన్నూరు, రామగుండం టీమ్స్​.. 

కాకా వెంకటస్వామి క్రికెట్ పోటీల్లో చెన్నూరు, రామగుండం నియోజకవర్గాల జట్లు ఫైనల్‌‌కు చేరాయి. ఈ నెల 9న హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ రెండు టీమ్‌‌ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. గురువారం ఉదయం మంచిర్యాల, రామగుండం మ్యాచ్ జరగగా రామగుండం గెలిచింది. మధ్యాహ్నం చెన్నూరు, ధర్మపురి నియోజకవర్గల మధ్య పోటీ జరగగా, చెన్నూరు జట్టు గెలుపొందింది. ఆయా నియోజకవర్గ పరిధిలో టాపర్‌‌‌‌గా నిలిచిన జట్టుకు రూ.30 వేల క్యాష్​, రన్నర్ జట్టుకు రూ.15 వేల క్యాష్​ బహుమతిని వివేక్​ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ వైస్‌‌చైర్మన్ ఎర్రం సాగర్​రెడ్డి, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ల కోసమే మిషన్​ భగీరథ..

గత బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ కాంట్రాక్టర్ల కోసమే మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఈ స్కీంలో పాత పైపులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఎక్కడా తాగు నీరు సప్లై కావడం లేదని ఆరోపించారు. పనులు పూర్తికాక ముందే 90 శాతం అడ్వాన్స్‌‌లు కాంట్రాక్టర్లకు చెల్లించారన్నారు. త్వరలో చెన్నూరు నియోజకవర్గంలో వాటర్‌‌‌‌ సప్లై చేసి, తాగు నీటికి ఇబ్బందుల్లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. 

వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా కుటుంబానికి క్రికెట్‌‌తో మంచి అనుబంధం ఉందని కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నీతో మంచి ప్లేయర్లు వెలుగులోకి వచ్చారని చెప్పారు. ఇక్కడి ప్లేయర్లను ఇండియా జట్టుకు ఆడించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రోత్సాహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.