- ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు: వివేక్ వెంకటస్వామి
- వంశీకృష్ణ ఎంపీగా గెలిస్తే అధిష్టానాన్ని ఒప్పించి పెద్దపల్లికి అధిక నిధులు తెస్తాం
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మహిళల ఖాతాల్లో రూ.లక్ష వేస్తామని వెల్లడి
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో వివేక్ ఎన్నికల ప్రచారం
కోల్‌బెల్ట్, వెలుగు: ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్, కాంటా ప్రాంతాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావుతో కలిసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో వ్యాపారులు, స్థానికులను కలిసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో నా అన్నయ్య గడ్డం వినోద్‌ను బెల్లంపల్లి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. అదే స్ఫూర్తితో వంశీకృష్ణను ఎంపీగా ఆదరించండి. కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్లు అధికారంలో ఉంటుంది. గ్రామాలు, పట్టణాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయి. కేసీఆర్ పదేండ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎన్నికలయ్యాక అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం”అని వివేక్ తెలిపారు.
‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలిలకు రూ.400 కూలీ ఇస్తాం. ఆరోగ్యశ్రీని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు వర్తింపజేస్తాం. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో ఏడాదికి రూ.లక్ష జమ చేస్తాం. మోదీ హయంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను రూ.1,200కు పెంచింది. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది”అని వివేక్ వెల్లడించారు. మోదీ, అమిత్‌షా అదానీ, అంబానీతో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలకు రూ.14 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, కానీ పేదలను మాత్రం పట్టించుకోలేదన్నారు.
ఇంటింటి ప్రచారం చేయండి..
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమైందని, భారీ మెజారిటీ తీసుకొస్తే అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు వస్తాయని వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు, మద్దతుదారులు కలిసికట్టుగా పనిచేసి వంశీకి అధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గంలో లక్ష మెజారిటీ తీసుకొస్తానని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హామీ ఇచ్చారని, చెన్నూరు నుంచి 70 వేలకు తగ్గకుండా మెజారిటీ రావాలన్నారు.
ఆరు గ్యారంటీలు, ప్రజలకు కాకా కుటుంబం చేసిన సేవలు, వంశీకృష్ణ విజన్‌పై ఇంటింటి ప్రచారం చేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. నేతకాని సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు, నేతకాని భవనాలను మంజూరు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రకటన చేయించానని తెలిపారు. నేతకాని మనిషిని కార్పొరేషన్ చైర్మన్ చేయిస్తానని వివేక్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు పంక్చర్ చేశామని, పార్లమెంటు ఎన్నికల్లో టైర్లు తీసేయాలన్నారు. తన చేతిలో 2009లో ఓడిపోయిన బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసా శ్రీనివాస్ ఇప్పటివరకు ఈ ప్రాంతానికి రాలేదని ఎద్దేవా చేశారు.
ప్రజల రుణాన్ని తీర్చుకుంటా: గడ్డం వినోద్
వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. తనను ఆదరించిన ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణాన్ని అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటానన్నారు. తాగు నీటి కోసం ‘అడ’ప్రాజెక్టు నుంచి సప్లయ్‌కి నిలిపివేసి, ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి సరఫరా చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. జూన్ 15 నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ రూల్స్ ప్రకారమే ఇసుక రవాణా
ప్రభుత్వ నిబంధనలను అనుసరించి.. చట్టప్రకారం పన్నులు చెల్లించిన తర్వాతే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక రవాణా జరుగుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం ముదిగుంటలో వంశీకృష్ణ తరుఫున నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో వివేక్ మాట్లాడారు. చెన్నూరులో ఇసుక దందా ఇంకా నడుస్తుందని బాల్క సుమన్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఒక వేబిల్లుతో పదులు సంఖ్యలో అక్రమంగా ఇసుక రవాణా జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఇసుక రవాణాపై అధికారుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నానని, అందులో ఎంత ఇసుక తీసుకుంటున్నారు.. ప్రభుత్వానికి ఎంత రాయాల్టీ కడుతున్నారనే విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఇసుక దందాకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించానని తెలిపారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఇసుక తరలించవద్దని కోరారు. తన కంపెనీలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లను కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించానని చెప్పారు.