- మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులకుప్పగా మార్చిండు
- హైదరాబాద్ చుట్టూ 20 వేల ఎకరాలు దోచుకుండు
- చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ప్రచారం
కోల్బెల్ట్, వెలుగు: దేశంలో ఏటా 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన ప్రధాని మోదీ.. పదేండ్లుగా యువతను మభ్యపెడుతూ 30 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా అదానీ, అంబానీ కోసమే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందారంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు.
అలాగే, కాసీపేట మండలం యాపలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ విషయమై సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో మాట్లాడితే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ హస్తం గుర్తుకే ఓటు వేస్తారన్న భయంతో ప్రధాని మోదీ ఆ ప్రక్రియను నిలిపివేయించారని ఆరోపించారు. అయినా ఆగస్టు 15లోపు రాష్ట్ర రైతులకు సీఎం రేవంత్ రుణమాఫీ అమలు చేస్తారని తెలిపారు. రాహుల్ ప్రధాని అయితే ఉపాధి కూలీలకు రోజుకు రూ.400 వేతనం వస్తుందని చెప్పారు. మహిళల అకౌంట్‌లో నెలకు రూ.8,500 జమ చేస్తామని రాహుల్ ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ తర్వాత సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలతో పాటు కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు.
సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఖజానాను ఖాళీ చేసిండు..
అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 20 వేల ఎకరాలను మాజీ సీఎం కేసీఆర్ దండుకున్నారని వివేక్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్ష కోట్లు కమీషన్ల పేరుతో దోచుకున్నారని, మిషన్ భగీరథ పేరుతో రూ.45 వేల కోట్ల కుంభకోణం చేశారని, ధరణి, ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం, ఇంటింటికి నల్లా, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు.
సొంత ఆస్తులు పెంచుకోవడానికి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారన్నారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహార శైలి గురించి చెప్పుకోవడానికి మాటలు కూడా రావడం లేదన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వస్తాయని వివేక్ అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ నిధులు కలిపి అభివృద్ధి పనులు చేసుకోవచ్చని చెప్పారు. కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి ప్రాంత ప్రజలకు 60 ఏండ్లుగా సేవలు అందిస్తుందన్నారు. కాకా బాటలోనే వంశీకృష్ణ ప్రజాసేవ చేస్తాడని చెప్పారు.
ఇంటికో ఉద్యోగం పేరుతో కేసీఆర్ మోసం చేసిండు: వంశీకృష్ణ
బీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి.. నిరుద్యోగుల తెలంగాణగా కేసీఆర్ మార్చారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ పార్టీ లీడర్లు ఇసుక దందాలు, ల్యాండ్ కబ్జాలు, భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400 వేతనం వస్తుందని చెప్పారు.
కాకా వెంకటస్వామి ఇక్కడి బిర్లా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు కూలి కోసం ఆ కంపెనీతో కోట్లాడి యూనియన్ ఏర్పాటు చేశారని, తర్వాత ఆయన 100 యూనియన్లకు కార్మిక నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. రూ.10 వేల కోట్లను మాపీ చేయించి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించిన ఘనత వివేక్ వెంకటస్వామికి దక్కుతుందని చెప్పారు.
కాకా స్ఫూర్తితో ప్రజాసేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మీ ఇంట్లో చిన్న కొడుకులా భావించి తనకు ఎంపీగా అవకాశం ఇస్తే, పెద్దపల్లిని మరింత అభివృద్ధి చెస్తానని చెప్పారు. గడ్డం వినోద్ మాట్లాడుతూ.. వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే చదువుకున్న యువతకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పెద్దపల్లిలో వంశీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని చెప్పారు.