- బీఆర్ఎస్ సర్కార్ వల్లే రైతులు నష్టపోయారు: వివేక్ వెంకటస్వామి
- పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రైతుల పరామర్శలు
- కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన వారికి పరిహారం ఎందుకివ్వలె?
- కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై మనీలాండరింగ్ కేసు పెట్టాలని డిమాండ్
కోల్‌బెల్ట్/యాదగిరిగుట్ట, వెలుగు : గత -బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంవల్లే రాష్ట్ర రైతులు నష్టపోయారని, ఈ విషయాన్ని డైవర్ట్ చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే పరామర్శల పేరిట మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరతీశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ నల్గొండ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని, బీఆర్ఎస్ నేతల హడావుడే తప్ప రైతులు ఎవ్వరూ రాలేదన్నారు.
సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం, చెన్నూరు మండలాల్లో వివేక్ పర్యటించి మాట్లాడారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాను. అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు ఎన్నికల కోసం పరామర్శల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారు’’అని మండిపడ్డారు.
‘‘కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం మోటార్లు మునిగినయ్. మేడిగడ్డ పిల్లర్లు కుంగినయ్. అన్నారం బ్యారేజీ లీకైంది. ఓ నదిపై ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి బ్యారేజీలు కట్టరు. కేవలం కమీషన్ల కోసమే డ్యామ్‌కు బదులు బ్యారేజీలు కట్టిన్రు. కేసీఆర్ వేసిన రాంగ్ డిజైన్ల వల్ల రూ.లక్ష కోట్లు నీళ్లపాలైనయ్’’అని వివేక్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేసీఆర్ కమీషన్లు తీసుకున్నారని, వీరిద్దరిపై మనీలాండరింగ్కేసు నమోదు చేసి, జైల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలోని ఓ ప్రాంతీయ పార్టీకి రూ.1,322 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్లు రావడంలో మర్మమేంటని ఆయన నిలదీశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని తాను మొదటి నుంచీ చెప్తున్నానని, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లను చూస్తే అదే నిజమని తెలుస్తోందన్నారు. ఇలాంటి అవినీతి, అక్రమాల పార్టీలో ఉండలేకే కడియం శ్రీహరి కూతురు కావ్య బీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ వద్దనుకున్నదని వివేక్ గుర్తుచేశారు.
క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు..
గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకే ఏటా కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెం ట్ నిర్వహిస్తున్నామని వివేక్ తెలిపారు. భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ లీడర్ చేకూర్తి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబసమేతంగా సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించాబరు. ఆలయానికి వచ్చిన వివేక్ ఫ్యామిలీకి అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి దర్శనం కల్పించారు. మొదట ఫ్యామిలీతో కలిసి స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న ఆయన.. ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. అంతకుముందు తన మనుమరాలు తలనీలాలను స్వామి వారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
భువనగిరిలో కాంగ్రెస్ గెలవాలె..
స్వామివారి దర్శనం తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్‌లో వివేక్ వెంకటస్వామిని స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిశారు. యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు వివేక్‌ను, ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను సన్మానించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా పార్టీ నేతలను కోరారు.
అనంతరం వివేక్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని సూచించారు. సీనియర్ నాయకులు జూనియర్లను సమన్వయం చేసుకుంటూ గ్రౌండ్ లెవల్‌లో పనిచేయాలని చెప్పారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలోని పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇకముందు చేపట్టబోయే అభివృద్ధి పనులను కూడా వివరించి, కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం తన కుమారుడు వంశీకృష్ణను స్థానిక కాంగ్రెస్ నాయకులకు వివేక్ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి టౌన్ పార్టీ అధ్యక్షుడు బందారపు బిక్షపతి, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, మండల నాయకులు బలరాం, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
నా ఫోన్ కూడా ట్యాప్ చేసిన్రు..
కేసీఆర్ తనకు అనుకూలమైన ఓ నలుగురు పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని ప్రతిపక్ష లీడర్లు, వ్యాపారవేత్తలు, సొంత పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తన ఫోన్‌ను కూడా హ్యాక్ చేశారని, పేస్ టైమ్ నుంచి తనకు పలుమార్లు అలర్ట్ వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్‌పై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. అన్ని శాఖల్లో తనకు అనుకూలమైన వాళ్లను పెట్టుకొని వ్యవస్థలను కేసీఆర్ డ్యామేజ్ చేశారని మండిపడ్డారు. ఎక్స్ ఆఫీసర్ల మాఫియా గ్యాంగ్‌కు బీఆర్‌ఎస్ సర్కార్ అను కూలంగా వ్యవహరించిందని, వీరిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.