జనం కోసమే తెలంగాణ

దశాబ్దాల నా కల, నా తండ్రి కల… తెలంగాణ. మనతో పాటు మన తాతలు, అమ్మనాన్నల కల… మనందరి లక్ష్యం… తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. అప్పుడే ఆరేండ్లు అయిపోయింది. ఏళ్ల తరబడి పోరాటం తర్వాత మన రాష్ట్రాన్ని సాధించుకున్న రోజును గుర్తుచేసుకుంటే మనసంతా సంతోషంతో నిండిపోతది. దీని కోసమే ఎన్నో రోజులు ఎదురుచూసినం. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నం. ఎన్నో ప్రయత్నాలు చేసినం. ఇంకెన్నో కష్టాలు పడినం. మన అన్నదమ్ములు ఎంతో మంది ప్రాణాలు పణంగా పెట్టారు. వారి బలిదానాలు… వారి కుటుంబాల త్యాగాల ఫలితమే ఇప్పటి మన తెలంగాణ. వారిని యాదిమరవకుంట.. భవిష్యత్ ను నిర్మించుకోవడమే మన ముందున్న కర్తవ్యం.

1969లో ప్రజాప్రతినిధిగా వెంకటస్వామి గారు నాటి ఉద్యమానికి అండగా నిలిచారు. ఆ ఉద్యమంలోనే ముషీరాబాద్ జైలు దగ్గర కాల్పుల్లో బుల్లెట్ దెబ్బతిన్నారు. చావుబతుకులతో పోరాడి బయటపడ్డారు. 1969లో రాష్ట్ర సాధన ప్రయత్నం విఫలమైనా అప్పుడు పడిన పునాదితో ఏదో ఒక రోజు తెలంగాణ సాధన ఖాయమని కాకా నమ్మేవారు. అదే మాట నాతో చెబుతుండేవారు. ఆ లక్ష్యంతోనే పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం ఎవరు కలిసొచ్చినా ఆయన సహకరించేవారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను సోనియాగాం ధీకి పరిచయం చేసి 2004లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిర్చారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే భయంతో చాలామంది కాంగ్రెస్ లీడర్లు తెలంగాణ గురించి మాట్లాడేవారు కాదు. కాకా మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లోనే తెలంగాణపై ప్రశ్నించారు. వయసు మీదపడుతున్నా తెలంగాణ సాధించాక, సొంత రాష్ట్రంలోనే చనిపోతానని చెప్పిన ఆయన కల నిజమయ్యాకే కన్నుమూశారు.

ఇది ఒక్కరోజులో… ఒక్కరితో మొదలైన పోరాటం కాదు. మూడు తరాలు కొట్లాడి… అన్యాయానికి ఎదురు నిలిచి సాధించుకున్న తెలంగాణ. ఇందులో తొలి తరం నుంచి ఇప్పటివరకు మా కుటుంబం, నేను భాగస్వామ్యం కావడం నాకు గర్వంగా అనిపిస్తది. తొలితరంలో మహాత్మాగాంధీ బాటలో స్వామి రామానంద తీర్థ అనుచరుడిగా మా నాన్నగారు వెంకటస్వామి (కాకా) నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. మన హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి వ్యతిరేకంగా నాటి నాయకులతో కలిసి పోరాడారు.

2009లో వెంకటస్వామిగారి స్థానంలో పెద్దపల్లి ఎంపీ సీటు నుంచి నేను తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టాను. తెలంగాణ కోసం మాట్లాడడమే కాదు… ఉద్యమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నాకు దొరికిన గొప్ప అవకాశం అది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలందరూ ఏకమైన కీలక సమయంలో వారందరితో పాటు ముందు నిలబడి పోరాడే అవకాశం దొరకడం నా అదృష్టం. నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రావడాన్ని జీవితంలో మర్చిపోలేను.

ఈ సందర్బంగా 2009 నుంచి 2014 మధ్య జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకోవాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చాక కూడా తెలంగాణపై నిర్ణయంలో చాలా ఆలస్యం జరిగింది. దీనిపై అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ కు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాం. రాష్ట్ర ఆదాయంలో 50 శాతానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తోందనీ, ఆయినా తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు ఆ నిధులను ఖర్చుపెట్టడం లేదని నేను ఆధారాలతో వివరించాను. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నది 79 శాతం తెలంగాణలో ప్రవహిస్తున్నా, కృష్ణా బేసిన్ 69 శాతం తెలంగాణలోనే ఉన్నా నీళ్ల విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆజాద్ ముందుంచాను. ప్రజంటేషన్ తర్వాత ఆజాద్ అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ‘‘ఆప్ ఐసా ప్రజెంటేషన్ దియాతో ఆంధ్రా ఖతం హోజాతా’’ అన్నారు ఆజాద్. అధికార పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాడినందుకు నాతో సహా ఏడుగురు ఎంపీలం సస్పెండ్ అయ్యాం. ఇది అప్పట్లో దేశమంతా సంచలనం రేపింది. సొంత పార్టీతో కొట్లాడుతున్న మా డిమాండ్ న్యాయమైందేనని నమ్మి, పలు పార్టీల నేతలు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని మాకు చెప్పారు.

నిద్రలేని రాత్రులు

రాష్ట్ర సాధన కోసం పార్టీలను పక్కనబెట్టి తెలంగాణ ఎంపీలంతా ఒకటిగా కలిసి పనిచేశాం. టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి, తెలంగాణ జేఏసీ, ఇతర మేధావులందరితో కలిసి కేంద్రం వెనక్కి పోలేని పరిస్థితిని తేగలిగాం. కొత్త రాష్ట్రం విషయంలో సోనియా సానుకూలంగా ఉన్నా అప్పటి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కొన్ని సందేహాలుండేవి. తోటి ఎంపీతో కలిసి ఆయన సందేహాలను తీర్చి పూర్తిగా కన్విన్స్ చేయగలిగాం. రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎం చేయాలన్న ఆలోచనకు అందరూ మద్దతిస్తున్నారనీ, తెలంగాణ వస్తే అప్పటి వరకు అధికారంలో లేని వర్గాలకు అధికారం దక్కుతుందని మేం రాహుల్ కు వివరించాం. పార్లమెంట్లో బిల్లు పెట్టే టైంలో వారం పాటు నిద్రలేని రాత్రులు గడిపాను. రెండునెలల్లో లోక్ సభ రద్దవుతున్న పరిస్థితిలో బిల్లు పాస్ కాకపోతే ఎప్పటికీ తెలంగాణ వచ్చే అవకాశం రాదేమోనన్న భయం. ఏది ఏమైనా అడ్డుకునే ప్రయత్నంలో సీమాంధ్ర నేతలు ఉన్నారు. లగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టి గందరగోళం రేపే ప్రయత్నం చేస్తే అందరం అడ్డుకున్నాం.

నాటి స్పీకర్ మీరాకుమార్ చుట్టూ వలయంలా నిలబడి బిల్లు పెట్టడానికి సహకరించాం. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అప్పట్లో బీజేపీ నేత అద్వానీనీ కలిసి బిల్లుకు మద్దతివ్వకుండా చేసే ప్రయత్నం చేశారు. దీంతో అద్వానీ కూడా గందరగోళం మధ్య బిల్లు ఎందుకని కామెంట్ చేశారు. ఇలాంటి టైంలో నాటి బీజేపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ సుష్మాస్వరాజ్ గొప్ప సహాయం చేశారు. తెలంగాణ కష్టం తెలిసిన ఆమె తల్లిలా స్పందించారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందని స్పష్టంగా చెప్పారు. నాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా బిల్లు పాస్ కావడంలో కీలకపాత్ర పోషించారు. గందరగోళం మధ్య సభ నడపొచ్చా అని స్పీకర్ సందేహిస్తున్నప్పుడు ఆయన చాణక్యం ప్రదర్శించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మద్దతిస్తున్నప్పుడు కేవలం 15 మంది ఎంపీల హంగామాకు బిల్లును ఆపడం సరికాదన్నారు. దీంతో మీరాకుమార్ ఒప్పుకున్నారు. ఇన్ని ప్రయత్నాల తర్వాతే… 2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లు పాసైంది. అదే ఏడాది జూన్ 2న మన రాష్ట్రం మనకొచ్చింది. మనందరి కల నిజమైంది. దశాబ్దాల కష్టం తీరిన ఆనందంతో తెలంగాణ తల్లుల గుండె ఉప్పొంగింది.

మన ముందున్న పని

అయితే మన రాష్ట్రం వచ్చాక మనం అనుకున్న సామాజిక న్యాయం జరగలేదు. మెజారిటీ వర్గాలు ఇంకా అధికారానికి దూరంగానే ఉన్నాయి. ఉద్యమం కోసం ముందుండి పోరాడినవాళ్లంతా వెనక్కిపోయారు. ఏ నీళ్ల కోసం కొట్లాడామో ఆ నీళ్లు ఇంకా మనకు దక్కలేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాలేదు. ఏ నిధుల కోసం కొట్లాడామో అవి ఆంధ్ర కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ దక్కలేదు. ఏ నియామకాల కోసం ఉద్యమం చేశామో ఆ ఉద్యోగాలు రాక మన యువత వలసపోతోంది. యూనివర్శిటీ గేట్ల లోపల, కోచింగ్ సెంటర్లలోనే వాళ్ల అర్హత వయసు దాటిపోతోంది. ఇదంతా చూస్తుంటే మనం తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉండిపోయామన్న ఆవేదన కలుగుతోంది. ప్రజల ఆకాంక్షలతో పనిలేకుండా, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా పాలించడాన్నే మనం ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. అలాంటి పరిస్థితి ఉండకూడదన్నదే మన ఉద్యమ లక్ష్యాల్లో ఒకటి.

మన హైదరాబాద్ ఆదాయంతోనే మిగిలిన ప్రాంతాలను బాగుచేసుకొని ఎదగాలని ఆశించాం. కానీ హైదరాబాద్ కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితిని మనం ఊహించలేదు. కావాల్సినన్ని ఉద్యోగాలు వస్తాయని లెక్కలు వేసుకున్నాం. కానీ నిరుద్యోగ భృతి కోసం అడుక్కునే పరిస్థితిని కోరుకోలేదు. కమీషన్ల కోసమే లిఫ్టు ప్రాజెక్టులు పెట్టడం ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. అప్పుడు మనం వ్యతిరేకించిన లిఫ్టులే ఇప్పుడు లక్షల కోట్లు మింగేస్తున్నాయి. మనం ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు. రైతులకు నిజంగా నీళ్లిచ్చే ప్రాజెక్టులు కోరుకున్నాం. సబ్బండ వర్ణాలు సాయం కోసం ప్రభుత్వం వైపు చూసే పరిస్థితే ఇంకా కనిపిస్తోంది. వాళ్లంతా అధికారంలో భాగం పంచుకొని, తమకు తాముగా ఎదిగే రోజులను మనం కోరుకున్నాం. వర్షాలు కలిసొచ్చి మంచి పంటలు పండిస్తున్న మన రైతులు ఇంకా గిట్టుబాటు ధర కోసం, పంట అమ్మడం కోసం తన్లాడుతున్నరు. ఈ పరిస్థితి మారాలి. ఒక్కరి ఆలోచనలతో కాకుండా తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కోసం ప్రజల ఆకాంక్షల ప్రకారం మన రాష్ట్ర నిర్మాణం జరగాలి. తెలంగాణ ప్రజలందరికీ 6వ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలతో…

తెలంగాణ కోసమే V6 న్యూస్, వెలుగు

2009లో నేను ఎంపీ అయిన మొదట్లోనే తెలంగాణ ఉద్యమంపై ఆంధ్రా మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను, కుట్రలను గమనించాను. ప్రజల ఆకాంక్షలను చెప్పకపోవడం, ఉద్యమాన్ని దారితప్పించడానికి ప్రయత్నించడం చేసేవి. మన ఉద్యమం, మన వాదన బలంగా వినిపించకపోవడానికి మనకంటూ మీడియా లేకపోవడమే కారణమని నాకు అర్థమైంది. తెలంగాణ వాయిస్ వినిపించేలా, పార్టీల కంటే ప్రజలకే ప్రాధాన్యం ఇచ్చేలా ఒక మీడియా ఉండాలని భావించాను. సీనియర్ జర్నలిస్టు అంకం రవి ఎడిటర్, సీఈఓగా చురుకైన  జర్నలిస్టుల టీమ్ తో V6 న్యూస్ ఛానెల్ ను 2012 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాం. ఉద్యమానికి కీలకమైన టైంలో తీసుకొచ్చిన V6 నా నమ్మకాన్ని నిలబెట్టింది. తొలిరోజు నుంచీ ఉద్యమానికి గొంతుకగా నిలిచింది. పార్టీలు, వర్గాలకు అతీతంగా తెలంగాణ వాయిస్ కి ఒకే వేదికగా నిలిచింది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంలా నిలిచింది. అప్పటివరకు ఏ మీడియాలోనూ మన భాష వినిపించలేదు. మన పండుగలు కనిపించలేదు. అందుకే మన జనం V6ని గుండెల్లో పెట్టుకున్నరు. ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలను బయటపెట్టి పటాపంచలు చేసింది.

చరిత్రను కళ్లకు కట్టి ప్రతిక్షణం స్ఫూర్తినిచ్చింది. రాష్ట్ర సాధనలో కీలకమైన తోడ్పాటు అందించింది. ఉద్యమంలో V6 పోషించిన పాత్రని నాటి ఉద్యమ నేతగా, తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. మన తెలంగాణలో జనానికి వాస్తవాలే తెలియాలి. సరైన సమాచారమే అందాలి. మంచిచెడులు గుర్తించి సరిచేసుకోవాలి. V6 ఇప్పటికీ జనం వాయిస్ గా అదే పాత్రను పోషిస్తోంది. అది నాకు చాలా సంతృప్తినిస్తుంది. మన రాష్ట్రం వచ్చాక తెలంగాణ పునర్నిర్మాణంలో వార్తాపత్రిక అవసరం కూడా ఉందని నాకు అనిపించింది. ఆ ఆలోచనతోనే ‘వెలుగు’ దినపత్రికను ప్రారంభించాం. దీన్ని రికార్డు వేగంతో ఆర్నెల్లలోనే జనంలోకి తీసుకొచ్చాం. ఉద్యమంలో V6 పోషించిన పాత్రనే ఇప్పుడు వెలుగు కొత్త తెలంగాణలో పోషిస్తోంది. V6, వెలుగు పత్రిక… ఈ రెండూ నా సొంతం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఉద్యమం కోసం, తెలంగాణ సమాజం కోసం వీటిని అంకితం చేశాను. అవి తెలంగాణ ప్రయోజనాల కోసమే, జనం వాయిస్ గానే ఎప్పటికీ పనిచేస్తాయని నేను హామీ ఇస్తున్నాను.

For More News..

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..

ఆరేండ్లలో ఎంతో సాధించినం

సికింద్రాబాద్ నుంచి 9 రైళ్లలో 13 వేల మంది

చైనా సైనికులకు ఆయుధాలను మనమే కొనిస్తున్నం