గూండాయిజాన్ని తరిమికొట్టాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలి : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు: బాల్క సుమన్ గుండాయిజాన్ని అడ్డుకోవాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలని ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డులు, సింగరేణి కార్మిక వాడలు, కోటేశ్వరరావు పల్లి పులిమడుగు, జైపూర్ మండల కేంద్రంతోపాటు మండలంలోని దుబ్బపల్లి వెంకట్రావుపల్లి, పెగడపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్క సుమన్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చలేదు కానీ, ఇసుక దందాతో రూ.1000 కోట్లు దండుకున్నాడని ఆరోపించారు. జైపూర్​లో పవర్ ప్లాంట్ ప్లాంటును కాకా వెంకటస్వామి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్​ను ఒప్పించి తీసుకువచ్చారని గుర్తుచేశారు. కానీ బాల్క సుమన్ తానే తీసుకొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను అభ్యర్తించారు.

కాంగ్రెస్​లో చేరికలు

 మందమర్రి మండలం పులిమడుగు గ్రామ సర్పంచ్ భూక్య దేవి, పులిమడుగు ఎంపీటీసీ ధరావత్ తిరుపతి,  బొక్కలగుట్ట సర్పంచ్ బొలిషెట్టి సువర్ణ, మాజీ ఎంపీపీ కనుకయ్య దంపతులతోపాటు 8 మంది వార్డు మెంబర్లు బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసి వివేక్ వెంకటస్వామి సమక్షంలో  కాంగ్రెస్​లో చేరారు. మందమర్రికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు శంకర్, టీఆర్ఎస్వీ మందమర్రి టౌన్ మాజీ ప్రెసిడెంట్ మూడారపు శేఖర్, రామకృష్ణపూర్​కు చెందిన బీఆర్​ఎస్​లీడర్ గండి కుమార్, గోపీకృష్ణ అనుచరులతో  కలిసి హస్తం గూటికి చేరారు. మందమర్రిలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పలువురు బీఆర్​ఎస్ లీడర్లు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. 

ఘనంగా సరోజ వివేక్ బర్డ్​డే సెలబ్రేషన్స్ 

వివేక్ సతీమణి, విశాక ట్రస్ట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ సరోజన బర్త్ డే సెలబ్రేషన్స్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని వారి నివాసంలో జరిగిన వేడుకల్లో వివేక్ వెంకటస్వామి, వారి తనయుడు గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ లీడర్ పాల్గొన్నారు. వివేక్​ దంపతులకు వారి అభిమాని కాడె సూర్యనారాయణ తిరుపతి ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సీపీఐ ప్రచార ర్యాలీలో గడ్డం వంశీకృష్ణ

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి మద్దతుగా రామకృష్ణాపూర్ లో సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో వివేక్ వెంకటస్వామి తనయుడు, యూత్ కాంగ్రెస్ లీడర్ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోల్ బెల్ట్​లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, సీపీఐ బలపరుస్తున్న అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జిల్లా సెక్రెటరీ రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా, పట్టణ స్థాయి లీడర్లు పాల్గొన్నారు.