కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల దోపిడీ: వివేక్ వెంకటస్వామి

అవినీతిలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకుంటున్నాడని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడం ద్వారా కల్వకుంట్ల కుటుంబం సొంత ఆస్తులు పెంచుకుంటోందని చెప్పారు. ‘‘ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. బీజేపీకి ఓటు వేయండి’’ అని మునుగోడు ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని లింగారెడ్డిగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ వెంకటస్వామి  మాట్లాడారు.  

మునుగోడులో హుజూరాబాద్ తరహా ఫలితమే రావాలి : ఈటల

గొల్ల కురుమలకు నగదు బదిలీ పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. హుజూరాబాద్ తరహాలో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతికి చెక్ పడాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.