సింగరేణి కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: వివేక్ వెంకటస్వామి

 సింగరేణి కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి  ప్రజలకు విముక్తి లభించిందని.. ప్రజల  పాలన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి అన్నారు. డిసెంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి ఏరియా కే.కే 5 గనిపై కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టియుసి యూనియన్ నిర్వహించిన  గేట్ మీటింగ్ లో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో ఇతర యూనియన్ నాయకులు..  ఐఎన్టియుసి యూనియన్ లో చేరారు. 

అనంతరం  వివేక్ మాట్లాడుతూ..  తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలిపించిన సింగరేణి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం  వాటా 51 శాతమని..  సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో వుంది.. కాబట్టి ప్రైవేటీకరణ జరగదని, కార్మికులు అపోహలు నమ్మొద్దని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో  కొత్త గనులు తీసుకొస్తుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమన్నారు. 

బిఐఎఫ్ఆర్  లిస్ట్ లో వున్న సింగరేణిని కాకా వెంకటస్వామి కాపాడారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చినట్టుగా.. ఐఎన్టీయూసీ యూనియన్ కార్మికులకు ప్రత్యేకంగా ఇస్తున్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  డిసెంబర్ 27 న జరగనున్న ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని గెలిపించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.