త్వరలో మరో రెండు పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. స్లాబ్ ల పేరిట బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొని కేసీఆర్ కోట్ల కమిషన్ దోచుకున్నాడని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలను ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉంది. దీనిపై బీఆర్ఎస్లీడర్లకు అపోహ ఉండేది. ఎలా అమలు చేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలు విజయవంతం చేస్తుండు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ కోసం రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టింది. ప్రస్తుతానికి స్లాబ్ ప్రకారం రూ.1000 బిల్లు వస్తుందని కరెంటు ఎస్ఈ చెప్తుండు. లబ్ధిదారులకు సర్కార్ జీరో బిల్లు ఇస్తుంది. పేద ప్రజలకు అండగా ఉంటూ భరోసా నిచ్చేది కాంగ్రెస్ పార్టీ’ అని వివేక్ తెలిపారు.
పిల్లలకు వ్యాక్సిన్ చేయించి.. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా వివేక్ మాట్లాడుతూ ‘గతంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో అంటే పెద్ద వ్యాధిగా భావించి ప్రజలందరూ భయపడేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పల్స్ పోలియో వ్యాక్సిన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరు పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు.