
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: కేసీఆర్, అమిత్‌షా కలిసి తన అరెస్టుకు కుట్ర చేస్తున్నారని చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీలో ఉంటే నిజాయతీపరుడిని, లేదంటే అవినీతిపరుడినా అని ఆయన ప్రశ్నించారు. ‘‘చెన్నూర్‌లో నా గెలుపు ఖాయం కావడంతో బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకున్నది. అందుకే కేసీఆర్ కాళ్ల మీదపడి ఎలాగైనా వివేక్ ను అరెస్ట్ చేసి, తనను కాపాడాలని ప్రాధేయపడ్డడు.
దీంతో కేసీఆర్.. అమిత్ షాకు టచ్‌లోకి వెళ్లి రెయిడ్స్ డ్రామాను తెరపైకి తెచ్చారు. వాళ్లిద్దరూ కలిసే దర్యాప్తు సంస్థలను నాపైకి ఉసిగొల్పుతున్నరు’’ అని వివేక్ ఫైర్ అయ్యారు. తన ఇండ్లు, సంస్థలే టార్గెట్‌గా ఐటీ, ఈడీ ఆఫీసర్లు సోదాలు చేసి నోటీసులు ఇచ్చి వెళ్లారని ఆయన చెప్పారు.
తనను అరెస్ట్ చేస్తే జనమే గెలిపించాలని చెన్నూర్ ప్రజలను వివేక్ కోరారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని కొత్తపల్లి, ఎల్బీపేట్, మద్దికల్, ఆరెపల్లి, అంకుశాపురం, ఎలికేశ్వరం, నేరేడుపల్లి, ఐటీడీఏ కాలనీ, పోతనపల్లి, బూరుగుపల్లి, నర్సింగాపూర్, కాజిపల్లి, దాంపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
ప్రచారాన్ని అడ్డుకునేందుకే దాడులు
‘‘బీజేపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసిన. కేసీఆర్ అవినీతి అక్రమాలను ఎండగడుతూ నాలుగేండ్లుగా పోరాటం చేస్తున్న. ఆయన అవినీతిని పలుమార్లు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన. కేసీఆర్, బీజేపీ ఒకటని తెలిశాక ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన” అని వివేక్అన్నారు. ‘‘రూ.20 లక్షల కంపెనీ.. రూ.200 కోట్ల లావాదేవీలు చేసిందని తప్పుడు వార్తలు రాసిన్రు. వార్తల్లో రాసిన సంస్థ అమెరికాలో ఉండే నా ఫ్రెండ్ యశ్వంత్ డ్డికి చెందింది. మొన్ననే కంపెనీ షేర్లు అమ్మితే.. రూ.50 కోట్ల లాభం వచ్చింది. రూ.9 కోట్లు ట్యాక్స్ చెల్లించాం. ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్ గురించి దర్యాప్తు సంస్థలు బయటకు చెప్పలేదు.
దీంతో నాపై కుట్ర జరుగుతున్నట్టు స్పష్టమైంది” అని వివరించారు. ఇప్పటి వరకు రూ.10 వేల కోట్ల ట్యాక్స్కట్టానని, తన వ్యాపారాలన్నీ లీగల్ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఐటీ, ఈడీ రెయిడ్స్‌తో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్.. 2014 ఎన్నికల్లో అన్ని రకాల సాయం చేసిన.. నేను ఆ సాయం చేయకుంటే నీ గతి ఏమైతుండే. అలాంటిది నాపై తప్పుడు ఆరోపణలతో రెయిడ్ చేయించావు. దమ్ముంటే నాపై గెలువు” అంటూ సవాల్ విసిరారు.
కేసీఆర్ 90 సీట్లు కోల్పోతున్నడు
‘‘కేసీఆర్ 90 సీట్లలో ఓడిపోతున్నాడు కాబట్టే ఓటుకు రూ.5 వేల చొప్పున పంచి ఓటర్లను ప్రభావితం చేసేలా కుట్రలకు దిగారు” అని వివేక్ అన్నారు. ‘‘బాల్క సుమన్.. నువ్వు నన్ను రెచ్చగొట్టినవ్.. చాలెంజ్ స్వీకరించి బరిలో దిగిన. దమ్ముంటే గెలువు” అని చాలెంజ్‌చేశారు. తాను ఎంపీ సెగ్మెంట్లో పోటీ చేద్దామనుకున్నానని, కానీ ప్రజల కోరిక, ఆకాంక్ష మేరకు చెన్నూర్ఎమ్మెల్యేగా బరిలోకి దిగినట్లు చెప్పారు. అహంకారి, అందుబాటులో ఉండని బాల్క సుమన్ ను ప్రజలు వద్దనుకుంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై సుమన్ కు ఏమాత్రం సోయి లేదని విమర్శించారు. దేశంలోనే నంబర్ వన్ అవినీతిపరుడు కేసీఆర్ అని ఇటీవల సర్వేలో వెల్లడైందని వివేక్ విమర్శించారు. ‘‘దళిత ముఖ్యమంత్రి అన్నడు. ఇంటికో ఉద్యోగం అన్నడు.
కేసీఆర్జూటా మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరు” అని అన్నారు. కేసీఆర్, బాల్క సుమన్ ఓటుకు ఇచ్చే విలువ రూ.5 వేలు అయితే, కాంగ్రెస్ ఇచ్చే ఆరు గ్యారెంటీల విలువ రూ.25 లక్షలని వివేక్ తెలిపారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చే అవినీతి పాలన కావాలో.. ఇందిరమ్మ రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.70 వేల కోట్ల కమిషన్ దండుకుంటే...ఆయన దత్తపుత్రుడు బాల్క సుమన్ చెన్నూర్ఇసుక అక్రమ రవాణాతో రూ.వెయ్యి కోట్లు దోచుకున్నారని వివేక్ మండిపడ్డారు. సుమన్ గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవడానికి రాడని, డబుల్ బెడ్రూమ్ఇండ్లు ఇవ్వలేదని, రోడ్లు సరిగా వేయలేదని అన్నారు. ఇసుక దందాలో ఎగ్గొట్టిన ట్యాక్స్ప్రజలకు ఖర్చు చేసినా.. అన్ని ఊర్లు బాగుపడేవని అన్నారు. కేసీఆర్ అబద్ధాలు ఇక నమ్మొద్దని సూచించారు. ప్రచారంలో భాగంగా వివేక్ వెంకటస్వామి సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అమిత్‌షా చెప్తేనే ఇచ్చిన
‘‘నేను ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు, కోట్లాది రూపాయల దందాలు చేస్తున్నట్లు నిన్న ఈడీ వాళ్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన్రు. నేను బీజేపీలో ఉన్నప్పుడు ఎట్లనన్న చేసి హుజూరాబాద్, మునుగోడు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అమిత్ షా నాకు ఆదేశాలి చ్చిండు. ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికల్లో నా సొంత డబ్బు ఖర్చు పెట్టిన. ఈటల రాజేందర్‌కు రూ.27 కోట్ల చెక్కు ఇచ్చిన. చెక్కు ద్వారా ఈటలకు పైసలిస్తే నోటీసేమో నాకు వచ్చింది. ఈటల బీజేపీలో ఉన్నడని ఆయనను కనీసం విచారణకు పిలవలేదు. ఇదేం న్యాయమో జనం చెప్పాలె’’ అని వివేక్ వెంకటస్వామి తెలిపారు.
కవిత మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు?
‘‘కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నరు. వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. ఆమె మీద ఎందుకు ఈడీ దాడులు చేస్తలేదని, ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని పబ్లిక్ అనుకున్నరు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. అందుకే కవిత మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎవరో ఒక లెటర్ ఇచ్చి ఫిర్యాదు చేస్తే ఈడీ నోటీసులు ఇచ్చి, నన్ను అరెస్ట్ చేస్తామంటూ రెండు రోజులు ప్రచారం చేయకుండా నిర్బంధించారు. కేసీఆర్దమ్ముంటే రా.. నేను ఎక్కడా తప్పు చేయలేదు’’ అని వివేక్ అన్నారు.
కక్ష సాధింపు చర్యలో భాగమే : పీఎస్సార్
వివేక్ వెంకటస్వామిపై ఈడీ దాడులను మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఖండించారు. వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు చేయని దాడులు ఇప్పుడు చేయడం కక్షసాధింపు చర్యలో భాగమేనని గురువారం ఆయన ప్రెస్ మీట్ లో అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ఈ దాడులు చేయించాయని మండిపడ్డారు.