జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట్ ఆలయంలో శ్రీ మల్లికార్జునస్వామిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
మల్లన్నపేట్ మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నానని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని విధాలా వారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతులు వరి పంట ఎంత పండించినా కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించి రైతులకు అండగా ఉండాలని వివేక్ వెంకటస్వామి కోరారు.