
- ఆయన మాటలే నాకు స్ఫూర్తి: వివేక్ వెంకటస్వామి
- ఇప్పుడూ ఆయన బాటలోనే నడుస్తూ అవినీతిపై కొట్లాడుతున్న
- కాకా వర్ధంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి నివాళులు
హైదరాబాద్, వెలుగు: ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా ధర్మం, న్యాయం వైపే ఉండాలని తన తండ్రి గడ్డం వెంకటస్వామి(కాకా) చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో పోరాడానని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అవినీతిపై కొట్లాడుతున్నానని తెలిపారు. అందరికీ కాకా ఓ రోల్ మోడల్ అని చెప్పారు. గురువారం కాకా 9వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి వివేక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేక్‌తోపాటు పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, ఓయూ స్టూడెంట్ జేఏసీ నేతలు కాకాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లను పంపిణీ చేసిన వివేక్.. మాలల అలయ్ బలయ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విలువలను పాటిస్తూ కిందిస్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన గొప్ప వ్యక్తి కాకా అని వివేక్ అన్నారు. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాకా.. కేంద్ర మంత్రిగా ఉన్నత స్థానాలను అందుకున్నారని చెప్పారు.
అవన్నీ కాకా చలవే
కాకా ఎన్నడూ తన స్వార్థం గురించి ఆలోచించలేదని, ప్రజల కోసమే పనిచేశారని వివేక్ అన్నారు. ప్రైవేటు కంపెనీల్లో పెన్షన్ సిస్టం తీసుకొచ్చినా, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినా, సింగరేణిలో లక్ష మంది ఉపాధిని కాపాడినా అది కాకా ఘనతేనని అన్నారు. నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కాకా.. ఆ శాఖ బడ్జెట్‌ను రూ.5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెంచేలా కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో సివిల్ సప్లయిస్ మంత్రిగా ఉన్నప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపారని వివేక్ గుర్తు చేశారు. బాగ్‌లింగంపల్లిలో కాకా అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేసి 2 లక్షల మందికిపైగా చదువును చెప్పించి ఉన్నత స్థానాల్లో నిలిపారని అన్నారు. అంబేద్కర్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లు సత్తా చాటుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తున్నారని చెప్పారు. ఎల్ఎల్ఎంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్.. అంబేద్కర్ లా కాలేజీలోనే చదివారని ప్రశంసించారు. మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, డొనేషన్లు లేకుండానే అడ్మిషన్లను ఇస్తున్నారని చెప్పారు.
తెలంగాణ కోసం సోనియా దగ్గర కొట్లాడిన్రు: జి.చెన్నయ్య
తెలంగాణ కోసం సోనియా గాంధీ దగ్గర కొట్లాడింది కాకా అని మాల మహానాడు కన్వీనర్ జి.చెన్నయ్య అన్నారు. ఆ ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. ఆ మాట తప్పి తానే సీఎం అయ్యారని విమర్శించారు. కాకా చరిత్రను పుస్తకాల్లో పాఠంగా చేర్చాలని ఓయూ స్టూడెంట్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.