కేసీఆర్ ఇంజనీర్ల మాట వింటే.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయేవి కావు : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు.  ప్రభుత్వం అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిందన్నారు.   మీడియాతో మాట్లాడిన ఆయన  బ్యారేజీల కుంగుబాటుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

మొదటి నుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పోరాటం చేసింది తానేనని చెప్పారు వివేక్ వెంకట స్వామి.  దీనిపై గత ప్రభుత్వానికి  ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని..  ఇప్పటికైనా ఈ  ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టిందన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అన్ని తానై వ్యవహరించారని..  కనీసం ఇంజనీర్ల  మాట విని ఉంటే ఇలా పిల్లర్లు కుంగిపోయేవి కాదన్నారు.  

మరోవైపు మేడిగడ్డ సందర్శనకు ఇవాళ సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. దీనికోసం ప్రభుత్వం నాలుగు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. వీటిని శాసనసభ ప్రాంగణంలో సిద్ధంగా ఉంచింది.  కాసేపట్లోశాసనసభ్యులతో బస్సులు బయలుదేరనున్నాయి.  ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ పర్యటనకు దూరంగా ఉంటామని ప్రకటించాయి.