కోల్ బెల్ట్, వెలుగు : కాంగ్రెస్‌లో చేరుతున్న లీడర్లు, కార్యకర్తలకు బాల్క సుమన్ ధమ్కీలు ఇస్తున్నాడని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని, అందరూ నిర్భయంగా ఉండాలని, అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమరవాది గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన చేరికల సభకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి ముఖ్య అతిథిగా వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బాల్క సుమన్ 5 ఏండ్లలో ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలను కలవలేదు. కేవలం ప్రగతిభవన్‌కే పరిమితమయ్యాడు. ఇసుక దందాలో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నడు. పేదలకు సేవ చేయాలన్న సోయి ఆయనకు లేదు” అని విమర్శించారు. ఇసుక దందాలో రెండు వేల కోట్లు దండుకున్న బాల్క సుమన్‌ను జైలుకు పంపే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. ఐదేండ్లలో రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలను బాల్కసుమన్ పట్టించుకోలేదని, ఎన్నికలు రాగానే ఆగమేఘాల మీద పనులు చేయిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బాల్క సుమన్‌ను బట్టలిప్పి కొట్టే సమయం వచ్చిందన్నారు.
ఆరు గ్యారంటీలను అమలు చేస్తం
రామకృష్ణాపూర్, మందమర్రిలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉండేదని, కాకా వెంకటస్వామి ట్రస్ట్ పేరుతో నీళ్ల సదుపాయాన్ని గతంలో ఏర్పాటు చేశామని వివేక్ చెప్పారు. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు ఉండరని, సింగరేణి కార్మిక కుటుంబాలకు వైద్యం అందడంలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఎన్నడూ సింగరేణి కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని, అట్లనే ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని అన్నారు.
కేసీఆర్ కంటే బాల్క సుమన్ 10 రెట్లు అహంకారి: వాసిరెడ్డి సీతారామయ్య
కేసీఆర్ కంటే బాల్క సుమన్ 10 రెట్లు అహంకారి అని, సొంత కార్యకర్తలనే కలిసే ఓపిక ఆయనకు లేదని ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసి రెడ్డి సీతారామయ్య విమర్శించారు. బాల్క సుమన్ మళ్లీ గెలిస్తే బతకలేమని ఆ పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చెన్నురు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గెలిచిన రోజే అసలైన దీపావళి అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు లీడర్లు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి వివేక్, ఓదెలు ఆహ్వానించారు. లీడర్లు దుర్గం నరేశ్, గోపతి రాజయ్య, పల్లే రాజు, మహంకాళి శ్రీనివాస్, శాంతానందం, బత్తుల వేణు, దాముక రమేశ్, నక్క శ్రీనివాస్, అకిరెడ్డి రాంబాబు, పైడిమల్ల నర్సింగ్, బానేశ్ సురేశ్, చంద్రగిరి ఎల్లయ్య, రాజయ్య, అక్బర్ అలీ, వనం సత్యం, మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గంగలోకే : నల్లాల ఓదెలు
తొమ్మిదేండ్ల కేసీఆర్ అవినీతి పాలనపై విసుగు చెందిన ప్రజలు.. బీఆర్ఎస్‌ను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. కాంగ్రెస్ వస్తేనే నిజమైన బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. అహంకారి బాల్క సుమన్‌ను ఓడించి, మనసున్న మారాజు వివేక్ వెంకటస్వామిని జనం ఆదరిస్తారని చెప్పారు. ఇప్పటికే అవినీతి, అక్రమాలు, దోపిడీలతో 70 కిలోల బరువున్న బాల్క సుమన్.. మళ్లీ గెలిస్తే 140 కిలోలు పెరిగి మన నెత్తిన భారం అవుతాడని ఎద్దేవా చేశారు.