కేసీఆర్ రూ.10వేలు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తుండు :వివేక్ వెంకటస్వామి

నల్గొండ : సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే బీసీలకు సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తానని హామీలిస్తున్నాడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ముఖ్యమంత్రికి తన కుటుంబం, ఓట్ల మీదున్న ప్రేమ ప్రజల మీద లేదని విమర్శించారు. మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన శాలివాహన సంఘం నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అందరూ మద్దతివ్వాలని కోరారు.

కేసీఆర్ రూ.100కోట్లు పెట్టి విమానం కొన్నాడంటే ఏ మేర అవినీతికి పాల్పడి ఉంటాడో అర్థం చేసుకోవాలని వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం ఒక్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే కోటి ఖర్చవుతుందని, అదంతా ప్రజల సొమ్మేనని చెప్పారు. ముఖ్యమంత్రి తన ఫాంహౌస్ కోసం లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించాడే తప్ప రైతుల కోసం కాదని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఉద్యమకారులను మరిచిపోయి మందు పోసే వారికి మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ఈ ఉపఎన్నిక కేసీఆర్కు గుణపాఠం కావాలన్న ఆయన.. మునుగోడులో మార్పు వస్తేనే తెలంగాణలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. లక్షల కోట్లు ఖర్చుచేసి కట్టిన కాళేశ్వరం ద్వారా పెద్దపల్లిలో ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని విమర్శించారు. 

తెలంగాణ కోసం కొట్లాడటమే కాకుండా సొంత ఆస్తులు అమ్మి ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి రాజగోపాల్ అని వివేక్ వెంకటస్వామి ప్రశంసించారు. గతంలో తాను కేసీఆర్ పార్టీలో ఉన్నప్పుడు జనానికి గొర్రెలు, పైసలిస్తే ఓటేస్తారని కేసీఆర్ చెప్పేవాడని, ఇప్పుడు రూ.10 వేలు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.