చండూరు, వెలుగు : మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో మార్పు వస్తుందని బీజేపీ ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం చండూరులో చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్‌తో పాటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బుధవారం చండూరులో చేనేత కార్మికుల కుటుంబాలను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నానన్నారు. తన తండ్రి వెంకటస్వామి కేంద్ర టెక్స్ టైల్స్ మినిస్టర్ గా కార్మికులకు సేవ చేశారని గుర్తు చేశారు. మునుగోడుతో పాటు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రాజెక్టుల్లో కమిషన్ తీసుకున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని ఉద్యమం చేసిన చేనేతల పరిస్థితి ఏ మాత్రం మారలేదన్నారు. గతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినప్పుడు తన మనస్సు తరుక్కుపోయిందని, దీంతో అప్పటి సీఎం వైఎస్‌ను కలిసి చేనేతలకు ఏదో ఒకటి చేయాలని కోరానన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో చేనేత కుటుంబాలతో సమావేశం నిర్వహించి రూ.312 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేయించానన్నారు. తన ఇంటి పక్కన ఉండే మిరియాల లక్ష్మమ్మ చేనేత కుటుంబానికి చెందినదని, తన తల్లి ఇంటి దగ్గర వదిలి వ్యవసాయానికి వెళ్తే ఆ తల్లే తనకు పాలిచ్చి పెంచిందన్నారు. అందుకే చేనేత కుటుంబాలకు, తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొన్నారు.